తెలంగాణలో షర్మిల
posted on Nov 22, 2012 5:16PM

వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర గురువారం సాయంత్రం తెలంగాణలోకి అడుగు పెట్టింది. షర్మిల తుంగభద్ర నది మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించారు. రాయలసీమలో 625 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల మహబూబ్‌నగర్‌లో 225 కిలోమీటర్లు నడక సాగిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర సాగుతుంది. ఆమె వెంట పాదయాత్రలో వాసిరెడ్డి పద్మతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యెడ్మ కిష్టారెడ్డి, స్వర్ణా సుధాకర్ ఉన్నారు.
షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్‌లోకి గురువారం మధ్యాహ్నం 2 గంటలకే ప్రవేశించాల్సి ఉంది. అయితే, ఆమె విశ్రాంతి తీసుకోవడం వల్ల, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. గురువారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. అయితే, ఆలస్యం కావడంతో కొద్ది దూరం మాత్రమే ఆమె నడక సాగిస్తారు.