Next Page 
మణిదీపం పేజి 1

                                                                    మణిదీపం
                                                                 __పోల్కంపల్లి శాంతాదేవి
   
   
    అరుణోదయకి ఎ.ఎస్.ఎమ్ గా ఓ పల్లెటూరికి పోస్టింగ్ వచ్చిందనగానే. "సిటీకి దూరంగా పల్లెటూళ్ళో ఎలా పనిచేస్తావు? వద్దు!" అంది తల్లి జానకమ్మ.

    "ఉద్యోగం చెయ్యాలనుకొన్నప్పుడు పట్నవాసంలో అయితేనే చేస్తానంతే కుదురుతుందా? ఎం.బి.బి.ఎస్. డాక్టర్ల కె గ్రామాల్లో సర్వీస్ చేయక తప్పడంలేదు. పల్లెటూరని నాకేం బెంగలేదు. పల్లెటూళ్ళలో లైఫ్ ప్రశాంతంగా వుటుంది. మనం ఎవరికీ తెలియకుండా వుండాలంటే నగరాలలో వుండాలట. మనం అందరికీ తెలిసి వుండాలంటే పల్లెల్లో వుండాలట. నాకు అనామకంగా జీవించాలని లేదు. నలుగురికీ సేవచేసి నలుగురిచేత మంచి అనిపించుకోవాలంటే పల్లెటూళ్ళలోనే ఆ అవకాశం ఎక్కువగా వుంటుంది. నర్స్ ట్రైనింగ్ నేను ఉద్యోగం కోసమే చెయ్యలేదు. నలుగురికి సేవ చేయవచ్చని చేశాను!" అంది అరుణోదయ.

    కూతురి మాటంటే మాటే! దాన్ని ఎవరూ మార్చలేదు, "ఎక్కడో పల్లెటూరు! ఆడపిల్లని ఒక్కదాన్ని ఎలా పంపగలను? నేను నీవెంట వద్దామంటే కార్తీక చదువు? దానికి ఆ పల్లెటూళ్ళో కాలేజీ వుండదుగా?"

    "నన్నయితే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ కానీయమ్మా! నిన్నూ చెల్లెల్నీ తీసుకువెళ్ళే విషయం తరువాత ఆలోచిద్దాం!"

    అరుణోదయకి ఓ అన్నయ్య కూడా వున్నాడు. అతడికింకా పెళ్ళి కాలేదు. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చెల్లెలి పోస్టింగ్ సంగతి వినగానే- "అక్కడికి దగ్గరే. పది, పదిహేను కిలోమీటర్ల దూరం అనుకొంటాను. వనపర్తి సివిల్ సర్జన్ గా చేస్తున్నాడు. ఆయన నాకు బాగా తెలుసు. ఎ.ఎన్.ఎమ్ గా నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కేసులు అక్కడికే తీసికెళ్ళాలనుకొంటాను! రామకృష్ణగారికి నేను లెటర్ రాసిస్తాను. తీసికెళ్ళి కలుపు! బస్ సౌకర్యం వుంటే నువ్వు వనపర్తిలో ఇల్లు తీసుకొని, అక్కడినుండి తిరగడమే బెటరనుకొంటాను.

    వనపర్తిలో అయితే డిగ్రీ కాలేజీ వుంది. కార్తీకని, అమ్మని తీసికెళ్ళితే కార్తీకని డిగ్రీ కాలేజీలో చేర్పించవచ్చు. పల్లెటూరిలో ఇళ్ళు అద్దెకు దొరకడం కూడా కష్టమే! దొరికినా పాయిఖానాలు, బాత్ రూంలూ వుండవు!" అన్నాడు.

    "కార్తీక పరీక్షలై పోయే వరకూ ఇక్కడినుండి తీసికెళ్ళటం కుదరదుగా? ఇంకా అయిదారు నెలల మాట! అక్కడికి వెళ్లాక విదానంగా ఆలోచించొచ్చులే అన్నయ్యా!"

    "పెళ్ళికావలసిన పిల్ల! ఒంటరిగా అంత దూరం పంపడం నాకిష్టం లేదురా!"

    "అమ్మ భయపడుతోంటే అరుణా! వెళ్ళకపోతేనేం? ఇక్కడే ఎక్కడైనా ప్రైవేట్ చేయవచ్చుకదా?"

    "భయం దేనికి? నేను వెళ్ళేది ఏ అడవిలోకో కాదు! మనలాంటి మనుషుల మధ్యకే! ఇంకా నేను ఆకుచాటు పిందెననుకుంటోంది అమ్మ! పిచ్చి అమ్మ!"

    "పెళ్ళిచేసి ఓ అయ్యచేతిలో పెట్టేంతవరకూ ఆకుచాటు పిందెవేనే!"

    "పెళ్ళయితే మగడిచాటు పిందెనౌతాను. అలా చాటు మాటు బతుకు నేనిష్ట పడవని నీకు తెలీదా అమ్మా? వ్యక్తిత్వం, స్వేచ్ఛ నా ప్రాణం?"

    నిజమే! చిన్నప్పటి నుండీ ఆమె మనస్తత్వం అంతే! ఎవరిమాటా వినే మనిషి కాదు! ఏ విషయంలోనైనా డేర్ డెవిల్ గా వ్యవహరిస్తుంది.

    చిన్నప్పటినుండి ఆటల్లో, పాటల్లో అన్నిటా ఫస్ట్! మెడిసిన్ చేసి డాక్టరు కావాలని ఎన్నో కలల మేడలు కట్టుకుంది.

    అయిదు సార్లు ఎమ్ సెట్ రాసినా రాంక్ రాలేదు. ప్రైవేట్ గా డొనేషన్ కట్టి మెడిసిన్ చేయించడానికి తమకి స్తోమత లేకపోయింది. రోగుల సేవ చేయాలన్న ఆమె కోరిక చివరికి నర్స్ ట్రైనింగ్ కి ప్రోత్సహించింది.

   
                                     *    *    *


    అరుణోదయ ఇచ్చిన చీటీ చదువుకుని, "నువ్వు వెంకట్ చెల్లెలివా? నువ్వు మాకు బాగా కావలసినదాని వన్నమాట! వెంకట్ అంటే మా అర్చనకి చాలా ప్రాణం! వాళ్ళిద్దరూ చదరంగం మిత్రులే! నువ్వు కూడా ఆడతావా చదరంగం?" అన్నాడు డాక్టర్ రామకృష్ణ, గొంతులో ఆత్మీయథా భావం తొణికిస్తూ.

    "ఆడటం వచ్చండీ!"

    "అర్చనా! ఎవరొచ్చారో చూడు!" లోపలికి కేకేశాడు సంబరంగా.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS