మహిళలకు అసలు పొట్ట ఎందుకు వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే!

 అందరూ సాధారణంగా పిలుచుకునే బెల్లీ ఫ్యాట్ చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ ఇది మహిళలను చాలా ఇబ్బంది పెడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడమే బెల్లీ ఫ్యాట్ గా పిలవబడుతుంది. అయితే ఈ పొట్ట భాగంలో కొవ్వు వచ్చినంత వేగంగా తగ్గదు. పొట్ట వచ్చిందంటే చాలామందిలో కామన్ గా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా సులువుగా వచ్చేస్తాయి. మగవాళ్లకు పొట్ట వస్తే సరదాగా నాలుగు జోకులు వేసుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ మహిళలు  దీన్ని అంత సరదాగా తీసుకోలేరు. పైగా ఇంట్లోనే వారిమీద చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదురవుతాయి.  అసలు ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే..

మహిళలో  పొట్ట కొవ్వు పేరుకుని పోవడానికి కారణం శరీరంలో హార్మోన్ల స్థితిలో మార్పు.  జీర్ణాశయ పనితీరు తగ్గడం, జీవక్రియ రేటు దారుణంగా పడిపోవడం వల్ల పొట్ట  భాగంలో కొవ్వు పేరుకుని పోతుంది. ఈిస్టోజెన్ స్థాయిలు పెరిగి పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుని పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి  పొట్ట పడుతుంది. ఇది చాలా సాధారణమైన విషయమే అయినా దాన్ని  ఎలా తగ్గించుకోవాలో చాలామందికి తెలియదు. ఈ పొట్ట కొవ్వుకు కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే..

ఆహారం..

సరైన ఆహారం తీసుకోకపోతే పొట్ట కొవ్వు పెరుగుతుంది. తీసుకునే చాలా ఆహారాలలో కొవ్వులు ఉంటాయి. శారీరక శ్రమకు మించి కొవ్వు పదార్థాలు తీసుకుంటే అవి పొట్ట రావడానికి కారణం అవుతాయి. జంక్ ఫుడ్, కోక్, కూల్ డ్రింక్స్, మైదా, బేకరీ ఐటమ్స్, కృత్రిమ జ్యూసులు చాలా ఈజీగా పొట్టకు కారణం అవుతాయి. పొట్ట తగ్గించాలని అనుకుంటే మొదట వీటన్నింటిని  వదిలెయ్యాలి.

గర్భం దాల్చడం..

గర్భం దాల్చిన  మహిళలలో చాలామందికి  బిడ్డను మోయడం వల్ల  పొట్ట సాగుతుంది. ప్రసవం తరువాత  ఈ పొట్ట సెట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొందరు మహిళలు వ్యాయామాలు, యోగా చేయడం ద్వారా తొందరలోనే దీన్ని సెట్ చేసుకుంటారు. కానీ  ప్రసవం తరువాత బిడ్డ సంరక్షణ, శరీరం చురుగ్గా లేకపోవడం వల్ల వ్యాయామం చేయకుండా ఉంటారు. దీని కారణంగా పొట్ట కొవ్వు పేరుకుపోతుంది.

పిండి పదార్థాలు..

ప్రతి ఒక్కరూ బరువు పెరగడానికి ప్రధాన కారణం పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగానూ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానూ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. శరీరంలోకి వెళ్లే కేలరీల కంటే శరారీక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు తక్కువగా ఉంటే అవి కొవ్వుగా రూపాంతరం చెంది బరువు పెరుగుతారు.  ఈ కొవ్వు ఎక్కువగా శరీరంలో పొట్ట భాగంలోనే పేరుకుపోతుంది కాబట్టి ఇది బెల్లీ ఫ్యాట్ కు కారణం అవుతుంది. దీన్ని తగ్గించాలంటే కార్బోహై్డ్రేట్లు తక్కువ తీసుకోవాలి. శారీరక శ్రమ ద్వారా ఖర్చయ్యే కేలరీలకు సరిపడా కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి.

పరిష్కారం..

పొట్ట తగ్గడానికి ముఖ్యంగా ఆహారం నియంత్రణతో పాటు వర్కౌట్లు కూడా చేయాలి. వాకింగ్, బ్రిస్క్ వాక్, యోగా, సూర్యనమస్కారాలు,  పొట్ట తగ్గడానికి నిర్దేశించిన వ్యాయామాలు చేయాలి.   ఆహారాన్ని ఒకే సారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. ముఖ్యంగా సిట్టింగ్ వర్క్ చేసేవారు ఆహారాన్ని చాలా మితంగా తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్ గల ఆహారాన్ని , నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సిట్టింగ్ వర్క్ లో ఉన్నవారు ప్రతి గంటకు ఒకసారి ఓ 5 నిమిషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

                                                   *నిశ్శబ్ద.