సహజ సన్‌స్క్రీన్‌లా పనిచేసే టమాటాతో మొటిమలు, రాషెస్‌, ఎండ వల్ల కమిలిన చర్మం నిగారింపును పొందడమే కాదు.. ఆరోగ్యంగానూ ఉంటుంది. వార్థక్యపు చాయల్ని నివారించే గుణం టమాటాల్లో ఉంది.

తాజా టమాటా రసం ఓ టేబుల్‌స్పూను తీసుకుని నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో దూదిని ముంచి ముఖమంతా రాసుకోవాలి. సవ్యదిశలో మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తరవాత చల్లనినీటితో కడిగేసుకోవాలి. చర్మంపై పేరుకున్న అధికజిడ్డు, మురికి వదులుతుంది.

యాక్నె సమస్య చాలా తక్కువగా ఉన్నట్లయితే..టమాటా ముక్కను తీసుకుని ముఖమంతా రాసుకుని కాసేపు వదిలేయండి. టమాటా గుజ్జును పూతలా వేసుకోవాలి. తరచూ చేస్తుంటే.. క్రమంగా మార్పు వస్తుంది.

జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు ఒక టమాటాను గుజ్జులా చేసి వడకట్టాలి. దీనికి కొద్దిగా కీరదోస రసం కలిపి దూదితో ముఖమంతా రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి.

టమాటా గుజ్జుకు కొద్దిగా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులు, పాదాలకు పూతలా వేయాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేయాలి. టమాటా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇక పెరుగు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను అందించి మృదువుగా మారుస్తుంది.

టమాటారసం చిక్కని మిశ్రమం అయ్యేదాకా తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత కడిగేయాలి. ఎండ కారణంగా నల్లగా మారి జీవం కోల్పోయిన చర్మానికి మెరుపునందించే పూత ఇది. అలాగే కీరదోస, తేనె టమాటా గుజ్జు కలిపి రాసుకున్నా కూడా తేడా కనిపిస్తుంది.

చర్మంలో తెరుచుకున్న గ్రంథులు, బ్లాక్‌హెడ్స్‌ వంటివి ఎక్కువగా వేధిస్తుంటే... టమాటాను గుండ్రంగా కోసి.. ముఖమంతా రుద్దాలి. ఇందులోని పొటాషియం, విటమిన్‌ సి సుగుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి.

ఎండ కారణంగా కమిలి ఎర్రగా మారిన చర్మానికి రెండు చెంచాల టమాటాగుజ్జులో నాలుగు టేబుల్‌స్పూన్ల మజ్జిగ కలిపి చర్మమంతా రాసుకోవాలి. అరగంటాగి కడిగేసుకుంటే తేడా ఉంటుంది.

టమాటాగుజ్జుకు సమపాళ్లలో పాలు కలపాలి. దీన్ని సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ప్రతిరోజు ముఖం, మెడకు రాసుకుని మునివేళ్లతో మర్దన చేయాలి. పదినిమిషాలయ్యాక చల్లనినీటితో కడిగేసుకుంటే.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.