ఆరోగ్యమైన, అందమైన జుట్టు కోసం...?

అందమైన జుట్టుకోసం రకరకాల షాంపులు, కండీషనర్లు, మసాజ్ లు, హెయిర్ ప్యాక్ లు ప్రయత్నించిన కూడా జుట్టు రాలిపోతునే వుందా? అయితే మీరు తీసుకునే ఆహారంలో జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు.

ప్రోటీన్లు అందుతున్నాయా ?

జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచేందుకు ప్రోటీన్లు (మాంసకృతులు) ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు తగినంత లేకపోతే జుట్టు పలుచబడిపోతుంది. అలాగే సల్ఫర్ అమినో ఆమ్లాలు అధికంగా ఉండే కోడిగుడ్డు, సోయాబీన్, రాగి, బీట్రూట్, ద్రాక్ష, నువ్వులు, అరటి, ఖర్జూరం వంటివి ప్రతీరోజు ఆహారంలో ఉండేలా చూసుకుంటే జుట్టు చక్కగా ఎదుగుతుంది.

సిల్కీ హెయిర్ కావాలా :

సిల్కీగా మెరిసే జుట్టు కావాలంటే విటమిన్ 'ఎ' తగినంత మీ శరీరానికి అందేలా చూసుకోండి. ఆకుకూరలు,నారింజ, అన్నిరకాల కాయగూరలు ప్రతిరోజూ తీసుకుంటే హెయిర్ సిల్కీగా వుంటుంది.

ఒత్తైన జుట్టుకోసం :

జుట్టు ఒత్తుగా ఉంటేనే ఏ హెయిర్ స్టైల్ అయినా అందంగా కుదిరేది. దానికోసం B కాంప్లెక్స్ విటమిన్లు అయిన ఫోలిక్ యాసిడ్ B-12 లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చికెన్, పాలకూర, నారింజ, బెండ, బీట్రూట్, ఉప్పిడి బియ్యం మొలకెత్తిన పెసలు గోధుమలు, వీలున్నన్నిటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే చాలు.

అలాగే ఐరన్, జింక్ కూడా జుట్టుకు మేలు చేసేవే. అటుకులు, రాగులు, నువ్వులు, వేరుసెనగ, బాదాం, చేపలు వీటన్నిటిలో ఐరన్ కావాల్సినంత ఉంటుంది. గుమ్మడి విత్తనాలు, గోధుమ గడ్డి మాంసం, పాలల్లో జింక్ వుంటుంది కాబట్టి వీటిని కూడా వీలయినప్పుడల్లా ఆహారంలో చేర్చాలి.

మంచినీరు ముఖ్యమే రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల మంచి నీటిని తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ చిన్ని అలవాటు మీ జుట్టుకు చక్కగా ఎదిగేలా చేస్తుంది.

 

- రమ