మోచేతులకు మృదుత్వం ఇలా...



అరచేతులు,  వెనక భాగం ముడతలతో, గరుకుగా వున్నా, అలాగే మోచేతుల వెనక కూడా గరుకుగా, నల్లగా వున్నా.. ఇంట్లోనే చిన్న చిన్న ప్రయత్నాలతో వాటిని మృదువుగా చేసుకోవచ్చు.  ఎలా అంటే...

1. దోసకాయ తో చర్మం మృదువుగా ..

దోసకాయలోని గింజలు తీసేసి గుజ్జుగా చేసుకోవాలి. దానిలో ఒక అరకప్పు మజ్జిగ , ఓ చెమ్చా ఉప్పు కలిపి (రాళ్ళ ఉప్పు అయితే మంచిది) , ముందుగా అరచేతులు, మోచేతులు దగ్గర వేడి నీటి బట్టతో తుడవాలి.  వేడినీటి వల్ల చర్మం మీద వున్న స్వేద గ్రంధులు బాగా తెరుచుకుంటాయి.  ఆ తర్వాత దోసకాయ మిశ్రమాన్ని అరచేతి వెనక, మోచేతి వెనక భాగాలకి రాసి  మృదువుగా రుద్దాలి. ఓ పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. మజ్జిగలో వుండే లాక్టిక్ ఆమ్లం , ఉప్పు మృత చర్మ కణాలను తొలగించి నలుపు విరిగేలా చేస్తే, దోసలో వుండే పోషకాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

2. సెనగపిండి తో నలుపు మాయం

సెనగపిండి లో కొంచం పసుపు, ఓ చెమ్చా నిమ్మ రసం కలిపి మోచేతుల్లో నల్లగావున్న ప్రాంతంలో పట్టించి ఓ పావుగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఆ తర్వాత  వేడినీటి టవల్ ని చుట్టి ఓ పది నిముషాలు ఉంచితే అరచేతి వెనక, మోచేతి వెనక వుండే నలుపు క్రమంగా తగ్గిపోతుంది.

3.  మరికొన్ని ....

*  ఓ కప్పు పెరుగులో చెమ్చా బాదాం పొడి కలిపి చేతులకి పట్టించి.. బాగా ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

*  ఓ చెమ్చా కొబ్బరినూనె, అరచెంచా నిమ్మరసం కలిపి నల్లగా వున్న ప్రాంతంలో పట్టించి, ఆతర్వాత  గోరువెచ్చటి నీటిలో తడిపిన బట్ట చుట్టి, పదినిమిషాల తర్వాత కడగాలి.

*  మోచేతి వెనక భాగానికి ప్రతిరోజు బాదం నూనె రాసినా మంచి ఫలితం వుంటుంది.

* అరచేతి వెనుక, మోచేతి భాగాలు తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి వాటికి రోజు తగినంత తేమ అందేలా చూసుకోవాలి.

-రమ