మెనోపాజ్ సమయంలో మహిళల్లో గుండెపోటు ప్రమాదం.. నిజమేనా..!


ప్రతి మహిళ జీవితంలో మెనోపాజ్ అనేది  ఒక ముఖ్యమైన దశ. అప్పటి వరకు ఎదుర్కొన్న ఋతుచక్రం మెల్లగా నెమ్మదించి ఆగిపోతుంది.  ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మార్పులను తెస్తుంది. ఈ సమయంలో,శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగానే ఈ సమయంలో మహిళల్లో గుండెపోటు ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని గైనకాలజిస్ట్ లు అంటున్నారు. ఇది నిజమేనా? ఒకవేళ నిజం అయితే దీనికి పరిష్కారం ఏమిటి? తెలుసుకుంటే..

మెనోపాజ్ తర్వాత  గుండెపోటు ప్రమాదం ఎందుకు?

మెనోపాజ్ తర్వాత మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి వేగంగా తగ్గుతుంది. ఈ హార్మోన్ గుండెను సురక్షితంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల  కొలెస్ట్రాల్,  రక్తపోటు పెరుగుతుంది. ఇది ధమనులలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది . 45 నుండి 55 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ.

ఇవన్నీ గుండెపోటు లక్షణాలే..

చాలా సార్లు మహిళలు గుండెపోటు  ప్రారంభ లక్షణాలను సాధారణ అలసట లేదా బలహీనతగా భావించి లైట్ తీసుకుంటారు.

ఛాతీ లేదా ఎడమ చేతిలో నొప్పి ఉండటం,  శ్వాస ఆడకపోవడం, ఆకస్మిక చెమట, తలతిరగటం.. మొదలైన సంకేతాలన్నీ గుండెపోటును సూచిస్తాయి.

జాగ్రత్తలు..

మెనోపాజ్ తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం  ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు .

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  ఆహారంలో తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు,  ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  ప్రతిరోజూ 30 నిమిషాలు నడక , యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి. మెనోపాజ్  సమయంలో ఒత్తిడి పెరుగుతుంది.  కాబట్టి ధ్యానం,  ప్రాణాయామం చేయాలి.

క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.  రక్తపోటు , కొలెస్ట్రాల్,  చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలి.

ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..


తగినంత నిద్ర పోవాలి.  రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం నివారించాలి.

శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.  ఇప్పటికే డయాబెటిస్ లేదా రక్తపోటు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.

                                *రూపశ్రీ.