పాలకూర, బీట్ రూట్ కంటే ఎక్కువ ఐరన్ ఉండే విత్తనాలు.. లేడీస్ తప్పనిసరిగా తినాలి..!

ఆడవారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఐరన్ లోపం, పోషకాల లోపం వల్ల అనీమియా, కండర ద్రవ్యరాశి, ఎముకలు బలహీనంగా ఉండటం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే తక్కువ పరిమాణంలో తిన్నా శరీరానికి మెరుగ్గా పోషకాలు అందించగల ఆహారాలు ఇలాంటి లేడీస్ సమస్యలకు చక్కగా చెక్ పెడతాయి. అలాంటి వాటిలో గుమ్మడికాయ విత్తనాలు ప్రముఖమైనవి. అసలు గుమ్మడికాయ విత్తనాలలో ఉండే పోషకాలేంటి? వీటిని ఆహారంలో ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు? తెలుసుకుంటే..
గుమ్మడికాయ గింజలలో పోషకాలు..
గుమ్మడికాయ గింజలు ప్రోటీన్, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలను ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల ఆరోగ్యం బలోపేతం అవుతుందని మహిళా వైద్యులు అంటున్నారు.
ఐరన్ కు పవర్ హౌస్..
గుమ్మడికాయ గింజలు ఐరన్ కు అద్భుతమైన మూలం. వాటిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాలకూర, బీట్ రూట్ వంటి ఐరన్ సోర్స్ ఎక్కువగా ఉన్న ఆహారాల కంటే ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి, శరీరమంతా ఆక్సిజన్ రవాణాకు ఐరన్ చాలా అవసరం. ఈ విత్తనాలను ప్రతిరోజూ గుప్పెడు తినడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. ఇది రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది.
మంచి నిద్ర, మనశ్శాంతి..
గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ట్రిప్టోఫాన్ మెదడును ప్రశాంతపరుస్తుంది, సెరోటోనిన్ అనే హార్మోన్ స్రావంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సెరోటోనిన్ ను హ్యాపీ ఫీలింగ్ హార్మోన్ అని అంటారు. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్..
గుమ్మడికాయ విత్తనాలలోని మెగ్నీషియం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ కణాలు రక్తంలో చక్కెరను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
చర్మం, జుట్టు, గోళ్లు..
గుమ్మడికాయ గింజలు జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అద్భుతమైన కలయిక. జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, చర్మ కణాలను మరమ్మతు చేస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తాయి. ఇవి జుట్టు, చర్మం, గోళ్లను ఆరోగ్యంగా, మెరిచేలా, బలంగా ఉంచుతాయి.
*రూపశ్రీ.

.webp)

