30 ఏళ్ళకే ముసలివాళ్లలా అలసటగా ఉంటుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సరి..!


30ఏళ్ళు అంటే అప్పుడప్పుడే బాధ్యత గల జీవితంలోకి అడుగుపెట్టినట్టు.  పెళ్లి,  భాగస్వామి,  పిల్లలు, ఉద్యోగం.. ఇల్లు చక్కబెట్టుకోవడం.. ఇలా చాలామంది మహిళలు 30 ఏళ్లలో బాధ్యతలలో బిజీగా ఉంటారు.  ఇలాంటి మహిళలు చాలా చురుగ్గా అన్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సరిగ్గా గమనిస్తే నేటికాలంలో 30 ఏళ్లకే చాలామంది మహిళలు చాలా భారంగా ఫీలవుతూ ఉంటారు. బలహీనంగా ఫీలవుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడుతుంటారు. మరీ ముఖ్యంగా శరీరంలో ఎముకలు, కండరాలు బలం లేనట్టుగానూ.. నడుము,కీళ్లు నొప్పులు.. ఇలా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. దీన్ని అధిగమించి తిరిగి ఉత్సాహంగా మారడానికి ఫిట్‌నెస్ నిపుణులు కొన్ని అద్భుతమైన చిట్కాలు పంచుకున్నారు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో మెంతినీళ్లు..

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతుంటారు.  కానీ నానబెట్టిన మెంతి నీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్,   రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది మహిళల్లో పీరియడ్స్ క్రాంప్స్ లేదా PCOSని నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది.

10 నిమిషాల నడక..

ఈ రోజుల్లో చాలా మందిలో విటమిన్ డి లోపం సర్వసాధారణం. ముఖ్యంగా మహిళలలో, అందునా గృహిణులలో ఎక్కువ. ఎముకలతో పాటు, రోగనిరోధక శక్తి,  హార్మోన్ల నియంత్రణకు విటమిన్ డి చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు  కేవలం 10 నిమిషాలు ఎండలో నడిస్తే,  తగినంత విటమిన్ డి పొందవచ్చు. ఇది  మానసిక స్థితిని మెరుగుపరచడానికి,  సెరోటోనిన్ స్థాయిని పెంచడానికి కూడా పని చేస్తుంది.

అల్పాహారం ఇలా..

ఉదయం అల్పాహారం ఎగ్గొట్టడం చాలామంది మహిళలు చేసే పని.  అంతేకాదు..  కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న భోజనం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్,  హార్మోన్ల అసమతుల్యత ప్రమాదం పెరుగుతుంది. 20 ఏళ్లు పైబడిన వారు తమ అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.

చక్కెర వద్దు..

ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే  చేర్చుకోవడం ఉత్తమం.  శుద్ధి చేసిన చక్కెరను నివారించాలి. ఇది గుండె జబ్బులు, మధుమేహం,  ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది వాపు,  ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శుద్ధి చేసిన చక్కెర మూత్రపిండాలకు కూడా చాలా హానికరం.

నిద్ర..

ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ఇది మానసిక ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మొదలైన వాటిని మెరుగుపరుస్తుంది. నిద్ర లేకపోవడం  మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.  నిరాశ ప్రమాదాన్ని పెంచుతుంది. తగినంత నిద్ర శరీర కణాలను మరమ్మతు చేస్తుంది.  బరువును నియంత్రణలో ఉంచుతుంది.

లింఫాటిక్ మసాజ్..

శోషరస వ్యవస్థకు గుండె లాంటి సహజ పంపు లేదు.  ప్రతి ఉదయం కేవలం 2 నిమిషాల తమకు తాము  మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది నీటి నిలుపుదలని తగ్గిస్తుంది.  రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.

                             *రూపశ్రీ.