అశ్వగంధ మహిళలు వాడితే జరిగేదేంటి..

ఆయుర్వేదం భారతదేశానికి అందిన గొప్ప వైద్య శాస్త్రం. భారతీయ ఋషులు, మహర్షులు రూపొందించిన ఈ వైద్య శాస్త్రం జబ్బు చేసిన ప్రాంతాన్ని మూలాల నుండి రిపేర్ చేయడం ద్వారా జబ్బును నయం చేస్తుంది. భారతదేశంలో శతాబ్దాలుగా వివిధ వ్యాధుల చికిత్సకు మూలికలను ఉపయోగిస్తున్నారు. వాటి ప్రయోజనాలను కాలక్రమేణా వైద్య శాస్త్రం నిర్ధారించింది. ఎన్ని శతాబ్దాలు దాటినా ఆయుర్వేద మూలికలకు ఉన్న ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికీ ఏవైనా వ్యాధుల కోసం ఈ మూలికలను ఉపయోగించుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. . అటువంటి శక్తివంతమైన మూలికలలో అశ్వగంధ ఒకటి.
అశ్వగంధ..
అశ్వగంధ అనేది ఆయుర్వేదంలో చాలా ప్రజాదరణ పొందిన, శక్తివంతమైన ఔషధం. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. అశ్వగంధను తరచుగా పురుషులకు మాత్రమే ప్రయోజనకరంగా పరిగణిస్తున్నప్పటికీ, కొన్ని రకాల సమస్యకు పరిష్కారంగా వైద్యులు మహిళలకు కూడా అశ్వగంధను రికమెండ్ చేస్తుంటారు. అశ్వగంధను ఉపయోగించడం వల్ల మహిళలకు కలిగే అద్బుతమైన ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
ఒత్తిడి, ఆందోళన..
నేటి బిజీ కాలంలో ఒత్తిడి లేని జీవితాలు అరుదు. చాలామంది ఎప్పుడూ ఒత్తిడి అనుభవిస్తూ ఉంటారు. ఆందోళన చెందుతుంటారు. వీటి నుండి ఉపశమనం పొందడానికి అశ్వగంధను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది సహజంగా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
హార్మోన్స్..
శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పురుషులు, స్త్రీలలో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యలకు చికిత్స చేయడానికి అశ్వగంధను ఉపయోగించవచ్చు. అశ్వగంధను తీసుకోవడం వల్ల హార్మోన్లను బాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యలు, PCOS, మెనోపాజ్ వంటి సమస్యలకు సహాయపడుతుంది. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్, సంతానోత్పత్తిని కూడా పెంచుతుంది.
నిద్ర..
అశ్వగంధ శరీరంలో శక్తి పెంచడంలో సహాయపడుతుంది. అలసటను తగ్గిస్తుంది. రోజూ రాత్రి మంచి నిద్ర కావాలి అనుకునేవారు అశ్వగంధను గోరు వెచ్చని పాలతో తీసుకోవాలి. ఇది ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.
బరువు..
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడానికి ఇబ్బంది పడేవారికి అశ్వగంధ ఒక వరం లాంటిది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. ఇది మొండిగా ఉండే బొడ్డు కొవ్వును వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
అశ్వగంధ ఎలా వాడాలి..
పౌడర్..
పడుకునే ముందు వెచ్చని పాలు లేదా నీటితో సగం లేదా ఒక టీస్పూన్ అశ్వగంధను కలపి తాగాలి.
టాబ్లెట్స్..
పడుకునే ముందు ఒక టాబ్లెట్ లేదా వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి.
అశ్వగంధ టీ..
ఒక వేరును నీటిలో మరిగించి, పడుకునే ముందు సిప్ టు సిప్ త్రాగాలి.
*రూపశ్రీ.



