వేయించిన పదార్థాలు.. మొటిమలు.. అసలు నిజాలు ఇవే.. !

మొటిమలు అమ్మాయిలకు పెద్ద శత్రువులు.  సాధారణంగానే అమ్మాయిలు అందమైన చర్మం కోసం చాలా ప్రయోగాలు చేయడం,  చాలా రకాల ఉత్పత్తులు వాడటం చేస్తుంటారు. అయితే మొటిమలు అందాన్ని చెడగొడతాయి.  ఎప్పుడైనా ఒక మొటిమ వస్తే అదేమంత పెద్ద సమస్య కాదు.  కానీ పదే పదే మొటిమలు రావడం, మొటిమలలో చీము, రక్తం ఎప్పుడూ కారుతూ ఉండటం,మొటిమల చుట్టూ   చర్మం అంతా ఎర్రగా కందిపోవడం వంటివి చాలామందిలో ఎదురవుతుంటాయి.  చాలామంది మొటిమలు రావడానికి వేయించిన ఆహారాలు తినడమే కారణం అని చెబుతూ ఉంటారు. ఇంతకూ వేయించిన ఆహారాలు మొటిమలు రావడానికి కారణం అవుతాయా? మొటిమలు పదే పదే ఎక్కువగా వస్తుంటే ఏం చేయాలి? తెలుసుకుంటే...


మొటిమలు.. వేయించిన ఆహారం..

వేయించిన ఆహారాన్ని  తినడం వల్లే మొటిమలు  వస్తాయని అనుకోవడం చాలా పొరపాటు అని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు.  మొటిమలు రావడం  వెనుక చాలా కారణాలు ఉంటాయి. వాటిలో చర్మ రకం, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, శరీరానికి సరిపడినంత నీరు తాగకపోవడం, వాతావరణం,  ఆహారం మొదలైన చాలా రకాల కారణాల వల్ల మొటిమలు వస్తాయి.

వేయించిన ఆహారాల పాత్ర..

వేయించిన ఆహారాలు శరీరంలో మంటను పెంచుతాయనేది వాస్తవం.  ఇది చర్మంలో సెబమ్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. ఇది రంధ్రాలను మూసుకుపోయి మొటిమలకు దారితీస్తుంది. అయితే ఇది కొంతమందిలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి వేయించిన ఆహారాల వల్ల అందరికీ మొటిమలు వస్తాయనేది వాస్తవం కాదు.


ఎవరికి సమస్య?

ఇప్పటికే జిడ్డుగల చర్మం, పదే పదే  మొటిమల బారిన పడే చర్మం ఉంటే వేయించిన ఆహారం తినడం వల్ల సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. చర్మ  రంధ్రాలు మూసుకుపోయే సమస్య ఉండే వ్యక్తులు మొటిమల సమస్యకు చాలా తొందరగా గురవుతారు.  అందుకే ఇలాంటి  వ్యక్తులు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

మొటిమలు వస్తే ఏం  చేయాలి?

మొటిమలు వచ్చినప్పుడు  ముఖాన్ని రోజుకు రెండుసార్లు తేలికపాటి ఫేస్ వాష్ తో కడుక్కోవాలి. ఫేస్ వాష్ లో కెమికల్స్ ఎక్కువ ఉండకూడదు.

మొటిమలు వచ్చినప్పుడు కంగారు పడటం కంటే ముందు మొటిమలు  రాకుండా చూసుకోవాలి. మొటిమలు వచ్చిన తరువాత  వాటి గుర్తులు తొలగిపోవాలన్నా చాలా సమయం పడుతుంది.

సాలిసిలిక్ యాసిడ్, వేప లేదా టీ ట్రీ ఆధారిత జెల్ రాయాలి.  ఇవి మొటిమలు తగ్గించడంలో ప్రబావవంతంగా ఉంటాయి.

ముఖంపై ఐస్ పూయడం వల్ల ఎరుపు తగ్గుతుంది.

పదే పదే మొటిమలు వస్తున్నా, మొటిమలు తగ్గకుండా చీము, రక్తం వస్తూ చర్మాన్ని ఇబ్బంది పెడుతున్నా వీటిని ఇంటి చిట్కాలతో నయం చేయాలని చూడకూడదు. ఇలాంటి సమస్యలున్నప్పుడు చర్మ సంరక్షణ నిపుణులను సంప్రదించి వైద్యం చేయించుకోవడం మంచిది.

                            *రూపశ్రీ.