ఈ విటమిన్ బాగుంటేనే మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటుందట..!

ఈ విటమిన్ బాగుంటేనే  మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటుందట..!

మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటేనే వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అయితే నేటికాలంలో  ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవడం,  ఎగ్స్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  దీనికి గల కారణాలలో విటమిన్ లోపాలు కూడా ఒకటి. మరీ ముఖ్యంగా విటమిన్-డి లోపిస్తే మహిళలలో ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందని,  ఎగ్స్ నిల్వలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఎగ్స్ విషయంలో విటమిన్-డి పాత్ర ఏమిటి? గర్బం దాల్చాలనుకునే మహిళలకు ఇది ఎంత అవసరం? మొదలైన విషయాలు తెలుసుకుంటే..

విటమిన్-డి..

విటమిన్-డి ప్రతి ఒక్కరి అవసరం.  దీన్ని సన్ లైట్ విటమిన్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం.  ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా,  డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గాలన్నా విటమిన్-డి స్థాయిలు పుష్కలంగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ విటమిన్-డి మహిళలలో ఎగ్ క్వాలిటీ, ఎగ్ నిల్వల ఆరోగ్యానికి చాలా అవసరం అని అంటున్నారు.

విటమిన్-డి, గుడ్ల నాణ్యత..

మహిళల అండాశయంలో గుడ్ల నాణ్యత బాగుంటే గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తగినంత విటమిన్ డి స్థాయిలు ఉన్న స్త్రీలలో మెరుగైన అండాశయ నిల్వలు,  అధిక-నాణ్యత గల గుడ్లను కలిగి ఉంటాయి. ఎందుకంటే విటమిన్ డి గ్రాహకాలు అండాశయాలలో ఉంటాయి. ఇక్కడ అవి ఫోలికల్ పెరుగుదల,  గుడ్డు పరిపక్వతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ విటమిన్ డి స్థాయిలు ఫోలికల్ అబివృద్దిని, ఎగ్స్ మెచ్యురిటీని ప్రభావితం చేస్తాయి. ఇది  ప్రెగ్నెన్సీ  అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాదు.. విటమిన్-డి స్థాయిలు తక్కువ ఉన్నప్పుడు సక్సెస్ అయ్యే ప్రెగ్నెన్సీ లో కడుపులో బిడ్డ బలహీనంగా ఉండే అవకాశాలు  ఉంటాయి.

విటమిన్-డి.. ఇంప్లాంటేషన్..

ఎగ్స్ హెల్తీగా, క్వాలిటీతో ఉండటానికే కాదు.. ఫలదీకరణంలో   కూడా విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది.  గర్భం ప్రారంభం కావాలంటేట పిండం గర్భాశయ పొరలో సక్సెస్ గా అమరాలి.  ఈ ప్రక్రియకు రోగనిరోధక శక్తి బాలెన్స్డ్ గా ఉండటం చాలా అవసరం.  ఇది పిండాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.  విటమిన్-డి గర్బాశయంలోని రోగనిరోధక కణాలను మాడ్యులేట్ చేయడం ద్వారా పిండం గర్బాశయ పొరలో సక్సెస్ గా అమరడంలో సహాయపడుతుంది.

IVF చికిత్సలో కూడా విటమిన్-డి స్థాయిలు అధికంగా ఉన్న మహిళలు,  విటమిన్-డి స్థాయిలు తక్కువగా ఉన్న మహిళల కంటే  తొందరగా గర్బం దాల్చగలుగుతారని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు. అందుకే గర్భం దాల్చడానికి ప్రయత్నించే వారు విటమిన్-డి స్థాయిలు తగినంత ఉండేలా చూసుకోవాలి. అలాగే గర్భం దాల్చిన మహిళలు కడుపులో బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్-డి స్థాయిలు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.

                               *రూపశ్రీ.