Read more!

చలికాలంలో మెరిసే జుట్టు సొంతం కావాలంటే.. ఇలా చేయండి!

చలికాలంలో మెరిసే జుట్టు సొంతం కావాలంటే.. ఇలా చేయండి!

శీతాకాలంలో జుట్టు తరచుగా పొడిగా,  గరుకుగా మారుతుంది. దాదాపు ప్రతీ అమ్మాయి సీజన్ తో సంబంధం లేకుండా అందంగా ఉండాలని ఎలా కోరుకుంటుందో జుట్టు కూడా అలాగే మెరుస్తూ ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మెరిసే జుట్టు ఎప్పుడూ దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ చలికాలంలో జుట్టు మెరుపు కోల్పోవడం వల్ల జుట్టు బలహీన పడి క్రమంగా జుట్టు రాలిపోతుంది కూడా. అందుకే చలికాలంలో జుట్టుకోసం ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగని జుట్టును  జాగ్రత్తగా చూసుకోవడానికి శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు. జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది టిప్స్ పాటిస్తే సరి..

పెరుగు..

తలకు పెరుగుతో  హెయిర్ ప్యాక్ వేసుకుంటే  చాలా ప్రయోజనాలు ఉంటాయి.  జుట్టుకు ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా మొండి చుండ్రు ఉంటే పెరుగును కొద్దిగా నీరు లేదా రోజ్ వాటర్‌తో కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. మెరిసే జుట్టు కావాలంటే ఈ మిశ్రమంలో  తేనెను కూడా కలుపుకోవచ్చు.

అలోవెరా..

కలబంద జుట్టు సంరక్షణలో చక్కగా సహాయపడుతుంది. జుట్టును మాయిశ్చరైజ్ చేసి మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది.  తాజా అలోవెరా జెల్ లో ఆలివ్ కలిపి తలకు హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గంట తరువాత తల స్నానం చెయ్యాలి. ఇది జుట్టును సిల్కీగా మారుస్తుంది.

ఉసిరికాయ..

ఈ వింటర్ సీజన్ లో ఉసిరికాయలు  మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఉసిరికాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది. కోల్పోయిన మెరుపును తిరిగి అందిస్తుంది. తెల్లజుట్టు సమస్య తగ్గించడంలోనూ, చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలలోనూ ఉసిరికాయ  సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు ఇస్తుంది.

షియా బటర్..

దీన్నే షీ బటర్ లేదా షియా వెన్న అని కూడా అంటారు. జుట్టు మెరుపును పెంచడంలో షియా బటర్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని నిమ్మకాయతో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుంది. మెరిసే జుట్టు కావాలంటే నిమ్మరసంలో షియా బటర్ మిక్స్ చేసి, జుట్టుకు అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత  జుట్టును నీటితో కడగాలి. జుట్టుకు మెరుపును ఇవ్వడమే కాదు.. జుట్టు ఆకృతిని కూడా చక్కగా ఉంచుతుంది.

                                       *నిశ్శబ్ద.