చిరుతో వినాయక్ చేసేది ఆ రీమేక్ కాదు!
on Mar 2, 2020
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగాభిమాని వీవీ వినాయక్ దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చాయి. ‘ఠాగూర్’ అప్పట్లో ఒక సంచలనం. చిరును పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చూసి ఖుషీ ఖుషీ అయ్యారు. మంచి కథ, పాటలు, ఫైటులు, డ్యాన్సులు, కమర్షియల్ అంశాలు... అందులో అన్నీ ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు వచ్చాయి. తర్వాత చిరంజీవితో వినాయక్ చేసిన సినిమా ‘ఖైదీ నంబర్ 150’. రాజకీయాల్లోంచి మళ్లీ తిరిగి సినిమాల్లో వస్తున్న మెగాస్టార్... ముందులా డ్యాన్సులు చేస్తారా? ఫైటులు చేస్తారా? అన్న సందేహాలకు చెక్ పెట్టింది. అంతే కాదు... మెగాస్టార్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో, అంతకు మించి వినాయక్ చూపించారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కడానికి రంగం సిద్ధమైంది. అయితే... అందరూ అనుకుంటున్నట్టు అది మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ కాదు. ఫ్రెష్ స్ర్కిప్ట్‌తో సినిమా చేయడానికి వినాయక్ రెడీ అవుతున్నారు.
సుకుమార్ స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్న ‘లూసిఫర్’ రీమేక్‌కు వినాయక్ డైరెక్ట్ చేస్తే బావుంటుందని చిరంజీవి భావించారు. వినాయక్‌ను పిలిచి అదే విషయం చెప్పారట. మెగాస్టార్ ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించారట. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాలకు రచయితగా పని చేసిన బెజవాడ ప్రసన్నకుమార్ రెడీ చేసిన ఒక కథను వినిపించారట. మెగాస్టార్‌కు అది నచ్చడంతో దాంతో సినిమా చేద్దామని చెప్పినట్టు భోగట్టా. అదీ సంగతి!! కొరటాల శివ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
