మహేష్ తో గొడవల్లేవ్... అదిగో ఉదాహరణ!
on Mar 2, 2020

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి మధ్య ఒక్క కథ చిచ్చుపెట్టిందని ఫిలింనగర్ కోడై కూసింది. సరైన కథ చెప్పకపోవడంతో వంశీ పైడిపల్లిని మహేష్ దూరం పెట్టాడని వార్తలు వచ్చాయి. దాంతో దర్శకుడు చిన్నబుచ్చుకున్నాడు అని చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు. అవేవీ నిజం కాదని, సినిమాలకు అతీతమైనది మా స్నేహం అని మొన్ననే వంశీ పైడిపల్లి స్పష్టం చేశారు. మహేష్ బాబుతో అతడికి ఏ విధమైన గొడవలు లేవని చెప్పడానికి మరో ఉదాహరణ జయసుధ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్.
సహజనటి జయసుధ పెద్ద కుమారుడు వివాహం ఇటీవల జరిగింది. సినిమా ప్రముఖుల కోసం శనివారం సాయంత్రం పార్క్ హయత్ హోటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో ప్రముఖులందరూ ఆ రిసెప్షన్ కి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్టార్ హీరోలలో మహేష్ హాజరు కాలేదు. అయితేనేం? సతీమణి నమ్రతను పంపించారు. ఆమె వెంట దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారు. ఇద్దరూ కలిసి రిసెప్షన్ కి వచ్చారు. ఫోటోలు దిగారు. ఇటీవల మహేష్ వంశీ పైడిపల్లి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. పెద్దలే కాదు పిల్లలు కలిసిపోయారు. వివిధ సందర్భాలలో కలసి కనిపిస్తున్నారు. సినిమా ఆలస్యం కావడం ఆ స్నేహం మీద ఎటువంటి ప్రభావం చూపించలేదని చెప్పడానికి జయసుధ కుమారుడు వెడ్డింగ్ రిసెప్షన్ ఒక ఉదాహరణ అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



