ENGLISH | TELUGU  

పవర్ స్టార్.. సమ్మర్ సీజన్‌కి సింగిల్ స్టార్!

on Feb 4, 2020

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది నిజంగా అమితానందం కలిగిస్తోన్న వార్త. లాయర్‌గా ఆయన క్రూషియల్ రోల్ పోషిస్తోన్న 'వకీల్ సాబ్' (వర్కింగ్ టైటిల్) మే 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ స్కేల్‌లో రిలీజవడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని అఫిషియల్‌గా ఆ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేయించిన 'వకీల్ సాబ్' టైటిల్‌ను ఉగాది పండగ రోజు మార్చి 25న అఫిషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది యువకులు వాళ్లపై లైంగిక హింసకు పాల్పడితే, న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన ఆ యువతుల తరపున వాదించే వకీలుగా పవర్ స్టార్ నటిస్తున్నాడు. ఇప్పటికే వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొన్నాడు. మార్చి నెలలోగా మరో రెండు వారాలు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని తన పోర్షన్‌ను ఆయన ఫినిష్ చేయనున్నాడు. హిందీ ఒరిజినల్‌లో లేని విధంగా ఈ సినిమాలో పవన్ ఫైట్లు కూడా చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

గమనించాల్సిన విషయం ఏమంటే.. ఈ సమ్మర్‌కు వస్తోన్న ఏకైక టాప్ స్టార్ ఆయనొక్కడే. దాంతో ఈ వేసవికి రికార్డులు బద్దలు కావడం ఖాయమని పవర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మార్చిలో మొదలయ్యే సమ్మర్ సీజన్‌లో రవితేజ, నాని, నాగచైతన్య, శర్వానంద్, సాయితేజ్ వంటి హీరోలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీళ్లెవరూ జనాదరణలో పవన్ కల్యాణ్‌కు సమవుజ్జీలు కారనే విషయం మనకు తెలిసిందే. మొదట సమ్మర్ సీజన్‌ను తన 'వి' మూవీతో నాని స్టార్ట్ చేస్తున్నాడు. అది మార్చి 25న వస్తోంది. ఇందులో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో తొలిసారి కనిపించబోతున్నాడు. ఇదే సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఏప్రిల్ 2న నాగచైతన్య, సాయిపల్లవి 'లవ్ స్టోరీ' విడుదలవుతోంది. శేఖర్ కమ్ముల రూపొందిస్తోన్న ఈ అందమైన ప్రేమకథ ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో క్రేజ్ సంపాదించుకుంది. 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్‌బస్టర్‌తో తన మార్కెట్ పరిధిని బాగా పెంచేసుకున్న రామ్.. ఏప్రిల్ 9న 'రెడ్' సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో అతను చేస్తోన్న మూడో సినిమా ఇది. ఇదివరకు వాళ్ల కాంబినేషన్‌లో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగి' సినిమాలు వచ్చాయి.

ఫిబ్రవరి 7న 'జాను' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తోన్న వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్.. ఆ సినిమా తర్వాత మరోసారి వేసవిలో 'శ్రీకారం' చుట్టేందుకు వస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కిశోర్ బి. రూపొందిస్తోన్న ఆ మూవీ ఏప్రిల్ 24న రిలీజవుతోంది. ఇక పవర్ స్టార్ వస్తోన్న నెలలోనే ఆయన మేనల్లుడు సాయితేజ్ వస్తున్నాడు. 'ప్రతిరోజూ పండగే' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత అతను నటిస్తోన్న 'సోలో బ్రతుకే సో బెటర్' మే 1న రిలీజవుతోంది. నభా నటేశ్ హీరోయిన్‌గా కనిపించే ఈ మూవీతో సుబ్బు డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ మే 8న 'క్రాక్' మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నాడు. రవితేజతో ఇదివరకు 'బలుపు', 'డాన్ శీను' వంటి హిట్ సినిమాల్ని తీసిన గోపీచంద్ మలినేని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండటంతో, రవితేజ మునుపటి బ్యాడ్ రికార్డుకు సంబంధం లేకుండా దీనికి పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఈ సినిమాలే కాకుండా సూపర్ హీరోయిన్ అనుష్క సైతం ఈ వేసవికి 'నిశ్శబ్దం'గా వస్తోంది. మాధవన్ హీరోగా నటిస్తోన్న ఆ మూవీ ఏప్రిల్ 2న విడుదలవుతోంది.

ఇన్ని సినిమాలున్నా.. ప్రేక్షకుల కళ్లు మాత్రం పవర్ స్టార్ సినిమా మీదే ఉంటాయనేది వాస్తవం. మే 15న ఆ సినిమా వస్తుందని దిల్ రాజు ప్రకటించడంతో అందరిలోనూ అమితాసక్తి వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే తమ సినిమా మే 8న రిలీజ్ అవుతుందని 'క్రాక్' మూవీ నిర్మాతలు ప్రకటించారు. అంటే వాళ్ల సినిమాకు రన్ ఉండేది కేవలం ఒక వారమే. మే 15న 'వకీల్ సాబ్' వచ్చేస్తుంది కాబట్టి థియేటర్లను ఆ సినిమాకి ఇవ్వక తప్పదు. అందువల్ల 'క్రాక్' సినిమా విడుదలను ముందుకు జరపడమో లేక వెనక్కి జరపడమో చెయ్యొచ్చని వినిపిస్తోంది. ఈ ప్రకారం పవన్ తప్ప మరో టాప్ స్టార్ ఎవరూ వేసవికి రావట్లేదు. ఇప్పటికే మహేశ్, అల్లు అర్జున్ సంక్రాంతికి వచ్చేసి, తమ కెరీర్ బెస్ట్ హిట్లు సాధించారు. వాళ్లు 2020లో మళ్లీ వచ్చే అవకాశాలు లేవు. చిరంజీవి సినిమా ఆగస్ట్ లేదా అక్టోబర్‌లో విడుదలవనున్నది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ జూలై 30న విడుదలవుతుందని గత ఏడాది అఫిషియల్‌గా ప్రకటించారు. తాజా రిపోర్టుల ప్రకారం ఆ సినిమా 2020లో రిలీజయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇక మిగిలింది ప్రభాస్. అతని నెక్స్ట్ మూవీ డిసెంబర్ లేదా 2021 బిగినింగ్‌లో రావొచ్చు. సీనియర్ స్టార్లయిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ కూడా సమ్మర్‌కి రావట్లేదు. సో.. సోలో టాప్ స్టార్‌గా ఈ సమ్మర్‌ను పవర్ స్టార్ క్యాష్ చేసుకోవడం ఖాయం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.