ENGLISH | TELUGU  

"బిజినెస్ మ్యాన్" మూవీ రివ్యూ

on Jan 13, 2012

 కథ - ఇది ఒక టిపికల్ పూరీ జగన్నాథ్ సింపుల్ కథ. ఒక యన్.ఆర్.ఐ. ఇండియా వచ్చి తన ఊరికి ఏదో మేలు చేద్దామని ఒక రాజకీయ నాయకుణ్ణి కలిస్తే, అతను యన్.ఆర్.ఐ.ని, అతని భార్యని చంపి అతని డబ్బుని దోచుకుంటాడు. పదేళ్ళ పిల్లవాడైన ఆ యన్.ఆర్.ఐ. కొడుకు సూర్య (మహేష్ బాబు) న్యాయం కోసం తన స్థాయిలో ప్రయత్నిస్తాడు. కానీ ఎవ్వరూ అతని మొర వినరు. దాంతో ఆ రాజకీయ నాయకుణ్ణి ఆ పిల్లాడు పొడుస్తాడు, పోలీస్ పిస్టల్ తో కాలుస్తాడు.

ఆ సానుభూతితో ఆ రాజకీయ నాయకుడు యమ్.యల్.ఎ. అవుతాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ముంబాయి చేరుకుని భాయ్ (డాన్) అవుతాడు. అలా ముంబాయ్ లో మాత్రమే కాకుండా దేశమంతా తన గ్యాంగ్ ని ఏర్పాటుచేసుకుని దేశరాజకీయాలను ప్రభావితం చేస్తాడు. ఆ తర్వాత తన తల్లితండ్రులను చంపిన వాడి ద ఎలా పగతీర్చుకున్నాడన్నది మిగిలిన కథ.

విశ్లేషణ - ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ కి బలుపు విపరీతంగా ఉంది. హీరో ప్రిన్స్ మహేష్ బాబుకి అంతకంటే ఎక్కువగా పొగరుంది. ఆ బలుపు, పొగరులకు బోలెడు మూర్ఖత్వం కలిస్తే ఈ "బిజినెస్ మ్యాన్ "సినిమా అవుతుంది. అలాంటి బలుపు, పొగరు, మూర్ఖత్వం ఉంటేనే ఇలాంటి "బిజినెస్ మ్యాన్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీయగలరు.

దర్శకుడిగా తనకు ఒక మహేష్ బాబు లాంటి హీరో దొరికితే తాను ఎలాంటి సినిమా తీయగలనో ఈ"బిజినెస్ మ్యాన్" సినిమాతో పూరీ జగన్నాథ్ చూపించాడు. ఇది పూరీ జగన్నాథ్ తెలివితేటలకు నిదర్శనం. ఈ సినిమా తీయటంలో పూరీ జగన్నాథ్ తెలివితేటలకు స్ఫూర్తిగా మరో ఆలిండియా మూర్ఖుడు రామ్ గోపాల వర్మ నిలిచాడు. ఇక చెప్పేదేముంది. అదే "బిజినెస్ మ్యాన్" సినిమా అయ్యింది.

కథ పక్కన పెడితే ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని పూరీ తీర్చిదిద్దిన తీరు మైండ్ బ్లోయింగ్. అత్యద్భుతమైన స్క్రీన్ ప్లే... ఈ చిత్రం స్క్రీన్ ప్లే వర్థమానదర్శకులకు ఒకపాఠంగా ఉంటుందని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లేతో ఒకసినిమాని ఎంత అర్థవంతంగా, ఇంకెంత ఆకర్షణీయంగా తీయవచ్చో ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం నిరూపించింది.

ఈ "బిజినెస్ మ్యాన్" సినిమాలో ప్రేక్షకులు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విశ్వరూపం చూస్తారు. ఇక ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత, మంచి మనసున్న నిర్మాత డాక్టర్ వెంకట్ ఈ చిత్రాన్ని ఎంత రిచ్ గా తీయాలో అంత రిచ్ గా తీశారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

నటన - ప్రిన్స్ మహేష్ బాబు ఈ చిత్రంలో ఆకాశమే హద్దుగా నటించాడు. అతని నటనలో ఒక మెస్మరైజింగ్ జిమ్మిక్ ఉంది. సినిమా అంతా, అంటే ప్రతి సీన్లోనూ మహేష్ బాబే కనిపించినా ప్రేక్షకులు ఇంకా కనిపిస్తే బాగుణ్ణు అనుకునేలా మహేష్ బాబు నటన ఉంది. అతని డైలాగ్ మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అద్భుతంగా ఉండి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ "బిజినెస్ మ్యాన్" సినిమాలో హీరోగా మహేష్ బాబు తప్ప ఇంకెవరు చేసినా ఆ సినిమాకి ఇంత రేంజ్ కచ్చితంగా రాదు. ఏ హీరోనీ అతనితో పోల్చలేం. ఆ రేంజ్ కి మహేష్ బాబు ఎదిగాడు...అలాగే ఈ సినిమాని ఆ రేంజ్ కి తీసుకెళ్ళాడుకూడా.

ఇంతకంటే మహేష్ బాబు నటన గురించి చెప్పలేం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమాలు తీసే దర్శకులకు ఈ రేంజ్ లో సినిమా తీయాలంటే చాలా చాలా కష్టపడక తప్పదు. బుర్రలు పాడుచేసుకోక తప్పదు. ఇక మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.

సంగీతం - సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకిచ్చిన సంగీతం హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోబోతోంది. దాన్ని బట్టి ఈ సినిమాలో సంగీతం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పాటలన్నీ ఇప్పటికే జనాదరణ పొందాయి. ఒక పాట( పిల్లా చావ్), రీ-రికార్డింగ్ లో అక్కడక్కడ కాపీ ట్యూన్లు వాడినట్లు అనిపించినా రీ-రికార్డింగ్ కూడా ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. సినిమాకి సంగీతం బాగా ప్లస్సయ్యింది.

సినిమాటోగ్రఫీ - చాలా చాలా బాగుంది. శ్యాం.కె.నాయుడు సినిమాటోగ్రఫీ కూడా హీరో మహేష్ బాబు నటన రేంజ్ లో, పూరీ దర్శకత్వం రేంజ్ లోనే ఉంది. మాటలు - ఈ సినిమాలో మాటలు దర్శకుడు పూరీ జగన్నాథ్ వ్రాయటం ఈ సినిమాకి చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. పూరీ మాటలను అద్భుతంగా వ్రాశాడనటం చాలా చిన్నపదం.

హీరో మహేష్ బాబు మాట్లాడే ఒక్కో డైలాగ్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్య చకితులను చేస్తుంది. ఈ సినిమాలోని మాటల గురించి వ్రాయాలంటే ఈ సినిమా స్క్రిప్టంతా వ్రాయాల్సిందే. అంటే ఈ సినిమాలోని మాటలు అంత అర్థవంతంగానూ, ఆలోచింపచేసే విధంగానూ, అంత మోడ్రన్ గానూ, అంత బాగానూ ఉన్నాయి.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కామేడీ కోసం కామెడీ ట్రాకులూ, కమెడియన్లు ఈ సినిమాలో ఉండరు. మహేష్ బాబు మాట్లాడే మాటల్లోనే బోలెడు కామెడీని పండించాడు పూరీ జగన్నాథ్. అది జనం నాడి తెలిసిన పూరీ జగన్నాథ్ గొప్పతనం. ఈ సినిమాలోని మాటలు వ్రాయటం అనే ప్రక్రియను పూరీ బద్దలుకొట్టాడు...చించేశాడు...ఇరగదీశాడు. ఈ సినిమాలోని మాటల గురించి చెప్పటానికి మాటలు చాలవు. ఇంతకంటే ఈ సినిమాలోని మాటల గురించి చెప్పలేం.

పాటలు - భాస్కరభట్ల రవికుమార్ వ్రాసిన అన్ని పాటలూ యువతను కచ్చితంగా ఆకట్టుకుంటాయి. సాహిత్యం నేటి తరానికి ఎలా కావాలో బాగా తెలిసిన రచయిత రవి కుమార్. భాస్కరభట్ల వ్రాసిన పాటలు ఈ చిత్ర విజయానికి తోడ్పడిన కారణాల్లో ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు.

ఎడిటింగ్ - చాలా షార్ప్ గా కట్ చేశారు. ఈ సినిమాలో ఒక్క వేస్ట్ ఫ్రేమ్ లేదు. ఎడిటింగ్ చాలా బాగుంది.

ఆర్ట్ - బాగుంది. కొరియోగ్రఫీ - దినేష్ కొరియోగ్రఫీ కొత్తగా ఉండి బాగుంది.

యాక్షన్ - మహేష్ బాబు అభిమాన యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్. విజయ్ కూడా మహేష్ బాబు సినిమా అంటే కొత్తగా ఏదో చేద్దామనే తపనతో ఉంటాడు. అదే ఈ సినిమాలో కనిపిస్తుంది. యాక్షన్ సీన్లు చాలా బాగున్నాయి.

హీరో ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలన్నింటిలో టాప్ మూవీగా ఈ "బిజినెస్ మ్యాన్" నిలుస్తుంది. కనుక ఈ సినిమా తప్పకుండా చూడతగ్గ చిత్రం. ఈ సినిమా చూడకపోతే మీరేదో మిస్సయినట్లే. అనుమానం లేదు. ఆఖరికి ఈ సినిమా రివ్యూ ఇలా వ్రాయటంలో కూడా ఈ "బిజినెస్ మ్యాన్" ప్రభావం ఉందంటే అతిశయోక్తి కాదు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.