English | Telugu

బిగ్ బాస్ 6 లో హ‌ర్ష సాయి.. ఇంత‌కీ ఎవ‌రిత‌ను?

`ఊరి నుంచి చాలా తీసుకున్నాం.. తిరిగి ఇచ్చేయాలి.. లేదంటే లావైపోతాం`. `శ్రీ‌మంతుడు` చిత్రంలోని ఈ డైలాగ్ ని ఇప్పుడో యువ‌కుడు హ‌ర్ష సాయి అక్ష‌రాలా పాటిస్తున్నాడు. ఎక్క‌డ పేద‌వాళ్లు అవ‌స‌రం కోసం ఎదురుచూస్తున్నారో అక్క‌డికి వెళ్లి వాళ్ల‌కు తెలియ‌కుండానే డ‌బ్బులు దానం చేస్తున్నాడు. చిత్ర విచిత్ర‌మైన టాస్క్ లు పెడుతూ పేద వాళ్లతో గేమ్స్ ఆడిస్తూ వాళ్ల‌కి కావాల్సిన‌ డ‌బ్బులు ఇచ్చేస్తున్నాడు. సాయం అన్న‌వారికి నోట్ల క‌ట్ట‌ల‌ని కుమ్మ‌రిస్తున్నాడు.

ఏకంగా ఇల్లు లేని వారికి ఇల్లు క‌ట్టిస్తున్నాడు. చిన్న‌పాటి బిజినెస్ చేసుకుంటామంటే వారికి అందినంత సాహాయం చేస్తూ నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాడు. క‌ష్టాల్లో వున్న వారి గుడిసెల ముందు నోట్ల క‌ట్ట‌లు చ‌ల్ల‌డం..పేద పిల్లాడికి సైకిల్ గిఫ్ట్ గా వ‌వ్వ‌డం..స్కూల్ ఫీజులు క‌ట్ట‌డం...బార్బ‌ర్ కు కొత్త షాప్ పెట్టించ‌డం.. పిల్ల‌లు లేని దంప‌తుల‌కు వెజిటెబుల్ షాప్ పెట్టించ‌డానికి డ‌బ్బులు స‌హాయం చేయ‌డం వంటివి చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు హ‌ర్ష సాయి.

ఇలాంటి వ్య‌క్తి త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజ‌న్ 6 లో పాల్గొన‌బోతున్నాడంటూ వరుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన హ‌ర్ష సాయి. త‌న‌కు ఆస‌క్తి లేదంటూ ఓ వీడియోని విడుద‌ల చేశాడు. త‌న‌కున్న పేరుని బిగ్ బాస్ లోకి వ‌చ్చి చెడ‌గొట్టుకోవ‌ద్దంటూ అభిమానులు కోర‌డంతో హ‌ర్ష సాయి బిగ్ బాస్ సీజ‌న్ 6లోకి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు. త్వ‌ర‌లో పేద‌ల కోసం రూ.10 ల‌క్ష‌లు ఖ‌ర్చుచేయ‌బోతున్నానంటూ హ‌ర్ష సాయి ప్ర‌క‌టించ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. హ‌ర్ష సాయి జ‌స్ట్ ఏ యూట్యూబ‌ర్‌.. అత‌నికి ఇన్ని ల‌క్ష‌లు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయి? .. ఎవ‌రిస్తున్నారు? అన్న‌ది మాత్రం మిస్ట‌రీగానే వుంది.