English | Telugu
'బిగ్ బాస్ అల్టిమేట్' నుంచి బయటకు వచ్చేసిన వనిత!
Updated : Feb 23, 2022
వివాదాస్పద తమిళ నటి వనితా విజయ్‌కుమార్ బిగ్ బాస్ అల్టిమేట్ షో నుంచి బయటకు వచ్చేసింది. ఆ షోకు సంబంధించి మోస్ట్ ప్రామిసింగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా భావించిన ఆమె హఠాత్తుగా బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. హాట్‌స్టార్ రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో తాను షో నుంచి బయటకు రావాలని అనుకుంటున్నట్లు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది వనిత. అంతకు ముందు కన్ఫెషన్ రూమ్ డోర్స్ తెరవమని బిగ్ బాస్‌ను గట్టిగా అరుస్తూ కనిపించిందామె. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన ఆమె బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి బయటకు రావాలని డిసైడ్ చేసుకుంది.
మనసులో అనుకున్నదే బయటకు చెప్పే మనిషిగా వనిత పేరు తెచ్చుకుంది. ఇది బిగ్ బాస్ తమిళ్ షోలో పాల్గొన్నప్పుడు తోటి కంటెస్టెంట్లు వనితది డామినేటింగ్ క్యారెక్టర్ అనీ, ఇతరులకు ఆర్డర్లు వేస్తుంటుందనీ చెప్పారు. అయితే తనలోనూ సున్నితమైన హృదయం ఉందని ఓ సందర్భంలో ఆమె తెలియజేసింది కూడా.
ప్రస్తుతం వనిత బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ అయిన బిగ్ బాస్ అల్టిమేట్ కంటెస్టెంట్లలో ఒకరుగా ఉన్నారు. ఏంజెల్స్ అండ్ డెమన్స్ అనే టాస్క్ సందర్భంగా వనిత తీవ్ర అసహనానికి గురయ్యింది. అప్పుడే కన్ఫెషన్ రూమ్ డోర్స్ తెరవమని బిగ్ బాస్‌ని అడిగింది. లోపలకు రమ్మనమని పిలిచినప్పుడు, ఆ టాస్క్‌పై ఫిర్యాదు చేసిన ఆమె, ఆ షో నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. తన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షో నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పింది వనిత. ఆమె నిర్ణయం ఫైనలేనా అని బిగ్ బాస్ మరోసారి అడగగా, అవునంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌లో తొలి సీజన్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ అల్టిమేట్ రోజుకు 24 గంటల పాటు ప్రసారమవుతోంది. మొదట ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన కమల్ హాసన్ లేటెస్ట్‌గా లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తోన్న 'విక్రమ్' మూవీ షూటింగ్ నిమిత్తం ఆ షో నుంచి తప్పుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన బిగ్ బాస్ తమిళ 5 సీజన్ల నుంచి 14 మంది కంటెస్టెంట్లను ఎంచుకొని, వారితో బిగ్ బాస్ అల్టిమేట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ షోకు కొత్త హోస్ట్ ఎవరనేది త్వరలో తేలుతుంది.