English | Telugu
బాలయ్య 'అన్ స్టాపబుల్'.. 40 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో సంచలన రికార్డ్!
Updated : Feb 9, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో హోస్ట్ గా ఒక టాక్ షో చేస్తున్నారని న్యూస్ రాగానే అందరూ షాక్ అయ్యారు. ఆ టాక్ షో ఎవరు చూస్తారు అంటూ కొందరు పెదవి విరిచారు కూడా. కానీ బాలకృష్ణ 'నేను దిగనంత వరకే.. ఒన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్' అంటూ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఆయన ఎనర్జీకి, కామెడీ టైమింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఈ షో రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది.
మొత్తం 10 ఎపిసోడ్స్ తో అన్ స్టాపబుల్ మొదటి సీజన్ అలరించింది. మొదటి ఎపిసోడ్ కి మోహన్ బాబు గెస్ట్ గా రాగా, ముగింపు ఎపిసోడ్ లో మహేష్ బాబు సందడి చేశాడు. ప్రతి ఎపిసోడ్ లోనూ గెస్ట్ లతో బాలయ్య సరదాగా మాట్లాడే విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మనస్సుకి ఏదనిపిస్తే అది చెప్తూ, చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తూ.. నిజ జీవితంలో బాలకృష్ణ ఇలా ఉంటాడా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ షో ఎవరు చూస్తారు అనుకున్నవాళ్ళని కూడా షో చూసేలా చేశాడు. అందుకే గెస్ట్ తో సంబంధం లేకుండా అన్ స్టాపబుల్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
అన్ స్టాపబుల్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అన్ స్టాపబుల్ మొదటి సీజన్ కు ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కాయి. దీంతో ఆహాలో మోస్ట్ వాచ్‌డ్ షోగా నిలిచింది. అంతేకాదు ఓటీటీలో తెలుగులో ఈ స్థాయిలో మరే షోకి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. మరి అన్ స్టాపబుల్ రెండో సీజన్ తో బాలయ్య ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.