English | Telugu

షణ్ముఖ్‌పై స‌ర‌యు కామెంట్స్ కాక‌రేపుతున్నాయ్‌!

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది న‌టి-యూట్యూబ‌ర్ స‌ర‌యు రాయ్‌. హౌస్‌లోకి వెళ్లేముందు ఆమె అగ్రెసివ్‌నెస్ చూసిన‌వాళ్లు ఎవ‌రూ ఆమె అంత త్వ‌ర‌గా ఎలిమినేట్ అవుతుంద‌ని ఊహించ‌లేరు. ఏదేమైనా ఎలిమినేష‌న్‌కు గురైన తొలి కంటెస్టెంట్‌గా నిలిచి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌వారితో షో నిర్వాహ‌కులు ఒక యాంక‌ర్‌తో ఇంట‌ర్వ్యూ జ‌రిపించి, హౌస్‌లో జ‌ర్నీ గురించి మాట్లాడించ‌డం, వాటి వివ‌రాల‌ను హౌస్‌మేట్స్‌కు షేర్ చేయ‌డం ఆన‌వాయితీ.

ప్ర‌స్తుతం ఇంట‌ర్వ్యూ బాధ్య‌త‌ల‌ను మునుప‌టి బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ నిర్వ‌ర్తిస్తోంది. ఎలిమినేట్ అయిన స‌ర‌యుతో ఇంట‌ర్వ్యూ జ‌రిపింది.
బిగ్ బాస్ హౌస్‌లోని మ‌గాళ్లంద‌రూ.. ఒక్క విశ్వ మిన‌హాయించి.. ప‌నికిరాని వాళ్లుగా తేల్చేసింది స‌ర‌యు. ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ గురించి చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు షాకింగ్ కామెంట్స్ చేసింది. "నువ్వు నిజంగా మ‌గాడివైతే, ద‌మ్ముంటే, స‌రిగా ఆట ఆడి చూపించాలి. లేదంటే, వెళ్లి ఇంట్లో కూర్చోవాలి" అని చెప్పింది. అలాగే వీజే స‌న్నీకి క్యారెక్ట‌ర్ లేద‌ని కూడా కామెంట్ చేసింది స‌ర‌యు. హౌస్‌లో విశ్వ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆమె అభిప్రాయ‌ప‌డింది.

కాగా, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌పై స‌ర‌యు చేసిన షాకింగ్ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ష‌ణ్ముఖ్ ఫ్యాన్స్ ఆ కామెంట్స్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, స‌ర‌యును ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కొంత‌మంది మాత్రం ష‌ణ్ముఖ్ ఇంత‌దాకా స‌రైన ఆట మొద‌లుపెట్ట‌లేద‌ని హోస్ట్ నాగార్జున కూడా పాయింట్ ఔట్ చేయ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ, అత‌నిపై స‌ర‌యు స‌రిగానే చెప్పింద‌ని ఆమె వెన‌కేసుకొస్తున్నారు.