English | Telugu

మా లిరిక్ రైట‌ర్స్‌ను ఇండ‌స్ట్రీలో స‌రిగా గుర్తించ‌ట్లేదు.. రామ‌జోగ‌య్య శాస్త్రి ఆవేద‌న‌!

తెలుగు చిత్ర‌సీమ‌లోని పాపుల‌ర్ లిరిక్ రైట‌ర్స్‌లో రామ‌జోగ‌య్య శాస్త్రి ఒక‌రు. సుప్ర‌సిద్ధ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి శిష్యుడిగా పేరు తెచ్చుకొని, ఆ త‌ర్వాత గేయ ర‌చ‌యిత‌గా మంచి డిమాండ్ తెచ్చుకున్నారు రామ‌జోగ‌య్య‌. అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌కు వ‌చ్చినంత పేరు కానీ, వాళ్ల‌కు ఇండ‌స్ట్రీలో ఇచ్చేంత ప్రాధాన్యం కానీ గేయ ర‌చ‌యిత‌ల‌కు లేదు. ఈ విష‌యం రామ‌జోగ‌య్య శాస్త్రిని బాధ‌పెడుతున్న‌ట్లు 'ఆలీతో స‌ర‌దాగా' షోలో ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఆ షో లేటెస్ట్ ప్రోమోలో "మీరు సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు క‌దా.. రీజ‌న్ ఏంటి?" అని అలీ అడిగారు. అందుకు, "సోష‌ల్ మీడియాలో నేను ప‌నిక‌ట్టుకొని ఉంటా. నాక‌ది ఇష్టం. దాని వ‌ల్ల కొంత స‌మయం పోతుంది. కానీ ఓ కార‌ణం కోసం చేస్తా. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు లిరిక్ రైట‌ర్స్‌కు రావాల్సిన‌టువంటి ప్రాధాన్య‌త ఇండ‌స్ట్రీలో కానీ, ప‌బ్లిక్ నుంచి కానీ లేదు. మా పనిని ఎక్కువ‌గా గుర్తించ‌ట్లేదు అన్న ఆలోచ‌న నాకు క‌లిగింది." అని చెప్పారు రామ‌జోగ‌య్య‌.

ఆడియో ఫంక్ష‌న్ల‌లోనూ త‌మ‌కు త‌గినంత ప్రాధాన్యం ఇవ్వ‌ట్లేద‌ని ఆయ‌న అన్నారు. "ఒక ఆడియో ఫంక్ష‌న్ తీసుకున్నా కానీ.. నిజానికి ఆ ఫంక్ష‌న్ మాకు సంబంధించిన‌ది అయిన‌ప్ప‌టికీ.. మాకంత ప్రామినెన్స్ ఉండ‌ట్లేదు అనిపించింది. 'న‌న్ను మీరు గౌర‌వించండి' అనే దానిక‌న్నా మ‌న ప‌నిని ముందుపెడితే, ఆ ప‌నే మ‌న‌కు కావాల్సిన గౌర‌వాన్ని తీసుకొచ్చి పెడుతుంది. సో, మ‌నం చేసే ప‌ని ప్ర‌మోట్ చేయ‌బ‌డాలి.. ఇది నా మ‌న‌సులో ప‌డ్డ బీజం. ఆరోజు నా ఆలోచ‌న‌కు అనుగుణంగా అందిపుచ్చుకున్న‌ట్లుగా సోష‌ల్ మీడియా విస్తృతంగా వ‌చ్చింది. 'నేను ఈరోజు ఈ పాట రాశాను, ఈ పాట లిరిక్ ఇది' అని అందులో పోస్ట్ చేస్తున్నాను. వాటికి యూత్ బాగా క‌నెక్ట‌వుతున్నారు." అని ఆయ‌న చెప్పుకువ‌చ్చారు. వ‌చ్చే సోమ‌వారం ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది. అందులో రామ‌జోగ‌య్య ఇంకెన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారో!