English | Telugu
నటరాజ్ మాస్టర్ ఇంటికి కొత్త కళ! పండంటి పాప పుట్టింది!!
Updated : Nov 18, 2021
డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ ఇంటికి కొత్త కళ. తను కోరుకున్న కోరిక తాజాగా నెరవేరడంతో నటరాజ్ మాస్టర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నటరాజ్ మాస్టర్ దంపతులకు పండంటి పాప జన్మించింది. ఈ ఆనందాన్ని నెటిజన్‌లతో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు నటరాజ్ మాస్టర్. తన భార్య నీతూ డెలివరీ కాగానే అంతులేని ఆనందానికి లోనైన నటరాజ్ మాస్టర్ ఇన్ స్టా లైవ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
తను పాప పుట్టాలని కోరుకున్నానని, తన భార్య మాత్రం బాబు కావాలని కోరుకుందని అయితే తను కోరుకున్నట్టే పాప పుట్టిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు నటరాజ్ మాస్టర్. బిగ్‌బాస్ సీజన్ 5కి ఎంపికైన నటరాజ్ మాస్టర్ ఆ తరువాత మధ్యలోనే హౌస్ నుంచి ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. హౌస్‌లోకి నటరాజ్ ప్రవేశిస్తున్న సమయంలో అతని భార్య నీతూ గర్భవతి. ఏ క్షణాన ఎలా వుంటుందో .. ఆ సమయంలో తన పక్కన వుండలేకపోతానేమోనని నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
అతను హౌస్‌లో వున్న సమయంలోనే నీతూకు బుల్లితెర తారలు సీమంతం చేయడం.. ఆ వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. నటరాజ్ తన భార్య పండంటి పాపకు జన్మనివ్వడంతో వెంటనే ఇన్‌స్టా లైవ్‌లో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తనని, తన వైఫ్‌ని, తన బేబీని బ్లెస్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. మీ ప్రేమని మా ముగ్గురిపై ఇలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నటరాజ్ మాస్టర్ అన్నారు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ పక్కనే వున్న లోబో కూడా తను మామని అయ్యానని ఆనందాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.