English | Telugu
జబర్దస్త్ కు రోజా గుడ్ బై!
Updated : Apr 11, 2022
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లకు నటి, పొలిటికల్ లీడర్ రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు మనో కూడా గత కొంత కాలంగా ఈ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే గత కొన్ని వారాలుగా రోజా తన పాత్రని తగ్గించుకుంటూ ఒకనాటి తన సహ తారలైన ఆమని, లైలాలకు చోటు కల్పిస్తూ వారికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఏపీ మంత్ర వర్గ విస్తరణలో రోజాకు చోటు దక్కనున్న నేపథ్యంలోనే ఆమె తన జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలలో తన పాత్రని తగ్గించుకుంటూ వస్తున్నారని వార్తలు వినిపించాయి.
రోజా కూడా ఇందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ వచ్చారు. ఫైనల్ గా రోజాకు ఏపీ మంత్రివర్గంలో అంతా ఊహించినట్టుగానే మంత్రి పదవి దక్కింది. దీంతో ఆమె జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలలో మునుపటి తరహాలో కంటిన్యూ కావడం కష్టమనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ షోలకు లైలా, ఆమని మాత్రమే జడ్జీలుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ వార్తలని నిజం చేస్తూ రోజా సోమవారం అధికారికంగా ఓ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ మంత్రివర్గంలో తనకు చోటు దక్కిన నేపథ్యంలో ఇకపై షూటింగ్ లకు వెళ్లనని, అన్ని షోలని తాను మానేస్తున్నానని ప్రకటించి షాకిచ్చారు రోజా. ఇకపై టీవీ షోల షూటింగ్ లలో తాను పాల్గొనని, సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపుని ఎప్పటికీ మర్చిపోనని, తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అంటే జగనన్న తనని రెండు సార్లు ఎమ్మెల్యేని చేశారని, ఇప్పడు మంత్రిని చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా వైఎస్ జగన్ మహిళా పక్షపాతిగా కేబినెట్ లో మంత్రిగా తనకు అవకాశం కల్పించడం తన అదృష్టం అని తెలిపారు రోజా. దీంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అభిమానులు రోజా లేకుండా ఈ కార్యక్రమం బోసిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నారట.