English | Telugu
నేటి బాలురే రేపటి బాలూలు.. చంద్రబోస్ కొత్త సామెత!
Updated : Jun 28, 2022
'పాడుతా తీయగా' ఈవారం చాలా హాయిగా సాగిపోయింది. పిల్లలందరూ అద్భుతంగా పాడారని జడ్జెస్ కూడా అభిప్రాయపడ్డారు. ఇక ప్రోగ్రాం స్టార్టింగ్ లో చరణ్ జడ్జెస్ ని ప్రోగ్రాంకి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారని అడిగారు. "12 మంది రాకెట్ సింగర్స్ తో మ్యూజికల్ యూనివర్స్ చుట్టి రావడమే" అని విజయ ప్రకాష్ అన్నారు. తర్వాత 'హెడ్ మిస్ట్రెస్' అంటూ సునీతను అడిగారు. 'ఎందుకు సర్ నాకా పేరు?' అని ఆమె అడిగారు. "మీరేమన్న ఫీల్ అవుతున్నారా" అన్నారు చరణ్. "చాలా సరదాగా ఉంటుంది అనుకున్నా కానీ మీరు నాకు ఆ టైటిల్ ఇచ్చేసారుగా ఇక స్ట్రిక్ట్ గా ఉండాలేమో" అన్నారు సునీత. "టైటిల్ కి, మీరు ఉండాలనుకునేదానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు" అని చెప్పారు చరణ్.
'తెలుగు మాస్టారు' అంటూ చంద్రబోస్ ని అడిగారు. "పిల్లలు పాటలు వింటుంటే ఒక సామెత గుర్తొచ్చింది నేటి బాలురే రేపటి పౌరులు అనే సామెతను కాస్త మార్చి నేటి బాలురే రేపటి బాలూలు" అంటూ మంచి కొటేషన్ చెప్పారు బోస్. ఇక ఈ ఎపిసోడ్ లో పిల్లలంతా మంచి సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేయగా జడ్జెస్ కూడా వాళ్ళ తప్పుల్ని సరిచేసి మంచి సజెషన్స్ ని అందించారు. ఇక లాస్ట్ కంటెస్టెంట్ ఆశ్రీత్ రాఘవ వచ్చి చంద్రముఖి మూవీ నుంచి "నా వాళ్ళ హృదయాలు విలువైన వజ్రాలు నువ్ కొంచెం సానబెట్టారా రిపీటే" అంటూ మంచి జోష్ తో పాడేసరికి జడ్జెస్ అంతా 'ఈ ఎపిసోడ్ మొత్తానికి ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్' అంటూ తేల్చారు.
అప్పుడు చరణ్ స్టేజి మీదకు వచ్చి తన చిన్నప్పటి ఇన్సిడెంట్స్ ని పంచుకున్నారు. ఒక కచేరీకి సింగపూర్ వెళ్ళినప్పుడు బాలు గారితో పాటు చరణ్, పల్లవి ఇద్దరూ వెళ్లారు. అక్కడ రిక్షా బళ్ళు ఉండేవట. దాని మీద ఎక్కాలని పల్లవి రోడ్డు మీద దొర్లి దొర్లి ఏడ్చేసరికి అసలే టెన్షన్ లో ఉన్న బాలు గారు ఇద్దరినీ తీసుకెళ్లి ఒక గదిలో పెట్టి లాక్ చేసేసారట. అసలు ఆయనంత టెన్షన్ పడే మనిషి కాదు కానీ ఆ రోజు ఎందుకో అలా ఉన్నారు అని గుర్తు చేసుకున్నారు చరణ్.
అలాగే ఇంకో ఇన్సిడెంట్ చెప్పారు. చరణ్, పల్లవి ఇద్దరూ సడెన్‌గా కనిపించకపోయేసరికి బాలు గారు గంటల తరబడి పిల్లల కోసం వెతికారట. చివరికి ఒక రూమ్ దగ్గర చాక్‌లెట్లు, బిస్కెట్లు తింటూ విసురుకుంటూ ఆడుకుంటుంటే, వచ్చి ఊపిరి పీల్చుకున్నారట. ఇక మా అమ్మ మమ్మల్ని చూసి ఏడ్చేసరికి నాన్నకు కోపం వచ్చి ఇద్దరినీ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చేత్తో కొట్టకుండా నీళ్లతో కొట్టడం మొదలెట్టారట. "ఆయన చేయి తగలకుండా చాలా స్మార్ట్ గా కొట్టారు మమ్మల్ని. మా నాన్న అంటే టెర్రర్" అంటూ ఆపాత సంఘటనలను గుర్తుచేసుకున్నారు చరణ్.