English | Telugu
బిగ్ బాస్ 5 హౌస్‌లోకి రవి వెళ్తున్నాడని కన్ఫామ్ చేసిన లాస్య!
Updated : Aug 9, 2021
బిగ్ బాస్ 5లో వీక్షకులకు తెలిసిన ముఖాలను, సెలబ్రిటీలను తీసుకురావడానికి నిర్వాహకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సురేఖా వాణి, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ రవి, టీవీ బ్యూటీ నవ్య స్వామి, సినీ తారలు ఇషా చావ్లా, పూనమ్ బజ్వా, కొరియోగ్రాఫర్ ఆనీ లాంటి వారు వెళ్లనున్నట్లు ఓ లిస్టు ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. అయితే తాను బిగ్ బాస్ 5 కంటెస్టెంట్‌గా వెళ్లడం లేదని ఇషా చావ్లా స్పష్టం చేసింది.
కాగా ఈసారి హౌస్‌లోకి యాంకర్ రవి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, అతడు కంటెస్టెంట్‌గా వెళ్తున్న విషయాన్ని అతడి జంట యాంకర్ లాస్య కన్ఫామ్ చేసింది. రీసెంట్‌గా 'కనబడుటలేదు' అనే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రవి, లాస్య యాంకర్లుగా వ్యవహరించారు.
మాటల మధ్యలో లాస్య మాట్లాడుతూ, "కనబడుటలేదు టైటిల్ చాలా బాగుంది. కొద్ది రోజుల్లో రవి కనిపించకుండా పోతాడేమోనని నా డౌట్" అంది లాస్య.
"ఏయ్" అని హెచ్చరించాడు రవి.
"ఏదో హౌస్‌లోకి వెళ్తున్నారు కదా.." అంది లాస్య.
ఆమెవైపు అలాగే సీరియస్‌గా చూశాడు రవి.. దాంతో లాస్య కవర్ చేసుకుంటూ, "ఐ మీన్.. మీ హౌస్‌లోకి వెళ్తున్నావ్ కదా" అంది.
"మా ఇంటికెళ్తున్నా" అన్నాడు రవి. లాస్య పెద్దగా నవ్వేసింది. అదీ విషయం!
నిర్వాహకులు వెల్లడించేదాకా కంటెస్టెంట్లు ఎవరూ తాము బిగ్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు బహిర్గతం చేయకూడదు. అందుకే తాను హౌస్‌లోకి వెళ్తున్న విషయాన్ని లాస్య కన్‌ఫామ్ చేయడంతో కళ్లతోనే ఆమెను రవి హెచ్చరించాడనీ, వెంటనే ఆమె దాన్ని కవర్‌చేస్తూ మాట్లాడిందనీ తెలుస్తోంది.
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించే 'బిగ్ బాస్' తెలుగు 5వ సీజన్ సెప్టెంబర్ 5న మొదలవుతుందని వినిపిస్తోంది.