English | Telugu

కార్తీక్‌ను నిలదీసిన పిల్లలు... ఆగ్రహించిన దీప!

‘మీ డాడీ మోనితను చీట్‌ చేశారట’ అని స్కూల్‌లో ఫ్రెండ్‌ షైనీ చెప్పిన దగ్గర్నుంచి కార్తీక్‌తో అతని పిల్లలు ఇద్దరూ మాట్లాడటం మానేసిన సంగతి తెలిసిందే. నాయనమ్మ సౌందర్య పలకరించినా ముభావంగా ఉన్నారు. దాంతో దీప రంగంలోకి దిగింది. భర్త బాధను చూడలేక, ఆయన ముందే పిల్లలు ఇద్దర్నీ నిలబెట్టింది. అప్పుడు కార్తీక్‌ను మోనిత విషయ‌మై పిల్లలు నిలదీశారు. దాంతో దీప ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం మీద ఈ రోజు (సెప్టెంబర్‌ 27) ‘కార్తీక దీపం’ ఎపిసోడ్‌లో పిల్లలు కొంత శాంతించినట్టు కనిపించినా... భవిష్యత్తులో మోనిత గర్భం గురించి తెలిస్తే మరో బాంబు పేల్చే అవకాశం లేకపోలేదు. అసలు, ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...

మేడతో మీద ఉన్న దీపకు హిమ కంటపడుతుంది. అమ్మాయి కన్నీళ్లు తుడుతూ ‘ఏమైంది?’ అని అడిగుతుంది. హిమ మాత్రం ఏమీ చెప్పకుండా వెళుతుంది. మరోవైపు భర్త కార్తీక్‌ ‘ఈ ప్రపంచం ఏమైనా అనుకోని దీపా! కానీ, నా పిల్లలు నన్ను అపార్థం చేసుకుంటే తట్టుకోలేను’ అంటాడు. పిల్లల దగ్గర ఎవరో ఏదో చెత్త వాగి ఉంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోడు. దాంతో నిజం చెప్పేద్దామని దీప అంటుంది. కానీ, ఒప్పుకోడు. అయితే, కొంచెం కూల్‌ అయ్యాక పిల్లలు ఇద్దర్నీ కార్తీక్‌ దగ్గరకు తీసుకొస్తుంది.

‘ఏంటీ మౌనం? ఏమైనా అడగాలంటే మీ డాడీని అడగండి. ఎదురుగా ఉన్నారుగా’ అని దీప కాస్త గట్టిగా చెబుతుంది. కాసేపు మౌనంగా ఉన్న పిల్లలు ఆ తర్వాత షైనీ చెప్పిన విషయాలు చెబుతారు. తండ్రిని నిలదీస్తారు. ‘మీ గురించి, మోనిత ఆంటీ గురించి తప్పుగా మాట్లాడారు’ అని హిమ ఏడుస్తుంది. ‘మీ ఇద్దరి మధ్య ఇంకేదో ఉందని అంటున్నారు’ అని శౌర్య చెబుతుంది. ఏదో దాస్తున్నారని ఇద్దరూ ప్రశ్నిస్తారు. దాంతో ముందు సీరియస్‌ అయినా చివరకు వాళ్లకు దీప ఓ కథ చెబుతుంది. ‘నీ ఫ్రెండ్‌ పారిపోతే ఎవర్ని అడుగుతారు?’ అని దీప ప్రశ్నిస్తుంది. ‘నన్నే’ అని శౌర్య సమాధానం ఇస్తుంది. ‘నాన్న విషయంలో అదే జరిగింది’ అని చెబుతుంది. ‘ఇటువంటి విషయాల గురించి ప్రశ్నిస్తారా? మాట్లాడకుండా ఉంటారా?’ అని నిలదీస్తుంది. ఆ తర్వాత అందరూ ఎమోషనల్‌ అవుతారు. తర్వాత ఏం జరిగింది? అనేది నెక్ట్స్‌ ఎపిసోడ్‌లో చూడాలి.