English | Telugu

మోనిత భ‌ర్త‌గా కార్తీక్ సంత‌కం చేసేశాడు.. దీప‌కు మ‌రోసారి అన్యాయం చేశాడా?

బిడ్డ మెడకు పేగు చుట్టుకుని ఆసుపత్రిలో పురిటినొప్పులు పడుతున్న మోనిత, త‌ను ఆప‌రేష‌న్ చేయించుకోవాలంటే కార్తీక్ వచ్చి సంతకం చేయాల‌ని మొండిపట్టు పట్టిన సంగతి తెలిసిందే. ఆసుపత్రికి వెళ్లిన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుతో తనది కృతిమ గర్భం కాదని, సహజంగా తల్లి అయ్యానని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. ఇవేవీ కార్తీక్ నమ్మడు. కానీ, అతడి తల్లి సౌందర్య నమ్ముతుంది. మోనిత మాటల్లో నిజాయతీ కనిపిస్తోంద‌ని కొడుకు చేత సంతకం పెట్టిస్తుంది. అయితే, ఈ విషయం దీపకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా చూడాలని తల్లీకొడుకులు అనుకుంటారు. కానీ, తెలుస్తుంది. ఎలా? అనేది నేటి (గురువారం) ఎపిసోడ్. ఈ రోజు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...

కార్తీక్ కారణంగా సహజంగా తల్లి అయ్యానని చెప్పిన మోనిత చివరకు స్పృహ కోల్పోతుంది. అయినా కార్తీక్ కరగడు. తల్లితో కలిసి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. ‌మోనిత చనిపోతుందని భారతి బ్రతిమాలినా వినిపించుకోడు. 'నువ్వు ఒక డాక్టరే కార్తీక్! ఆ విషయం మర్చిపోకు. ఏం చేస్తావో నీ ఇష్టం... నేను వెళ్తున్నా' అని భారతి అక్కడి నుండి బయటకు వెళ్లబోతుంటే... 'పేపర్స్ తీసుకునిరా కార్తీక్ సంతకం చేస్తాడు' అని సౌందర్య చెబుతుంది. 'నావల్ల కాదు మమ్మీ' అని కార్తీక్ అన్నా ఆమె వినిపించుకోలేదు. తల్లి బలవంతం చేయడంతో కార్తీక్ సంతకం చేస్తాడు. ఆ సమయంలో మోనితను భారతి లేపుతుంది. కార్తీక్ సంతకం చేయడం చూసి మోనిత కళ్ళల్లో ఆనందం ఉప్పొంగింది.

ఆపరేషన్ చేయాలని కార్తీక్, సౌందర్యను భారతి బయటకు పంపించేస్తుంది. 'మమ్మీ... నాకేం అర్థం కావడం లేదు' అని కార్తీక్ తల పట్టుకుంటాడు. 'మౌనిత ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పి ఉండవచ్చు. కానీ, ఈరోజు తన మాటల్లో నిజాయితీ కనిపించింది' అని సౌందర్య నిస్సహాయంగా చెబుతుంది.‌ 'అంటే ఏంటి మమ్మీ' అని కార్తీక్ అడుగుతాడు. తాను తప్పు చేశానని తన తల్లి నమ్ముతుందా? అనే భావం అందులో వ్యక్తమయింది. 'ఏమోరా?! ఎలా స్పందించాలో ఊహించడానికి భయంగా ఉంది.‌ దీప... పిల్లలు... ఇరుగుపొరుగు... వీళ్ళ అందరితో రేపు' అని సౌందర్య చెప్పబోతుంటే... తల్లి మాటలకు కార్తీక్ అడ్డుతగులుతూ 'నాకేం అర్థం కావడం లేదు' అని గట్టిగా అరుస్తాడు.‌ ఈలోపు భారతి వచ్చి పండంటి మగబిడ్డ పుట్టాడని చెబుతోంది.

ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరిన కార్తీక్, సౌందర్య ఎట్టి పరిస్థితుల్లోనూ విషయం దీపకు తెలియకూడదని అనుకుంటారు. 'దీపకు తెలిస్తే ఎలా మమ్మీ? అసలే ఆత్మాభిమానం ఎక్కువ. నేను ఏం చేసినా... ఎన్ని చెప్పినా... నన్ను క్షమించదు. ప్రస్తుతానికి ఈ విషయం దీపకు తెలియడానికి వీల్లేదు. దీపకు విషయం చెప్పవద్దని భారతికి కూడా గట్టిగానే చెప్పాను' అని కార్తీక్ తల్లితో చెబుతాడు.

మరోవైపు ఇంటిలో ల్యాబ్ దగ్గర పల్లవి చెప్పిన మాటలను తలుచుకుంటూ దీప ఆలోచనల్లో పడుతుంది. అదే సమయానికి ప్రియమణి అక్కడికి చేరుకుంటుంది. 'దీపమ్మా... నీకు అదిరిపోయే న్యూస్ చెబుతా. అది విన్నాక లబోదిబోమని ఏడుస్తావో, మూర్ఛ‌పోతావో చూడాలి' అని మనసులో అనుకుంటూ... పైకి 'దేవుడా నువ్వు కార్తీక్ అయ్య రూపంలో ఉన్నావ్. మా మోనితమ్మకి సాయం చేసేలా చేసావ్' అని దీపకు వినిపించేలా అంటుంది. ఏమైందని ప్రియమణి దగ్గరకు వెళ్లి దీప ఆడగ్గా.... ఆస్పత్రిలో జరిగిన విషయం అంతా చెబుతుంది. తాను చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దని అంటూనే.. కార్తీక్ సంతకం చేసిన విషయం బయట పెడుతుంది. దాంతో దీప షాక్ లో అలా ఉండిపోతుంది. ఆ త‌ర్వాత దీప ఏం చేసింద‌న్న‌ది వెరీ ఇంట్రెస్టింగ్.