English | Telugu
"నన్ను బయటకు తీసేది ఎవరు?".. జైల్లోంచి అడుగుతున్న నిరుపమ్ పరిటాల!
Updated : Aug 11, 2021
‘కార్తీక దీపం’లో కథానాయకుడు కటకటాల పాలైన సంగతి తెలిసిందే. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌ను ఏసీపీ రోషిణి అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్లింది. మోనితను నిజంగా డాక్టర్ బాబు చంపాడా? లేదా? అనేది త్వరలో తెలస్తుంది. కానీ, మోనిత మరణిస్తే బావుంటుందనీ... డాక్టర్‌బాబు, వంటలక్క దంపతులను విడదీయాలనుకుంటున్న మోనిత అడ్డు తొలగాలని కోరుకుంటున్న ప్రేక్షకులు ఉన్నారు. అయితే, మోనిత హత్య కేసులో కార్తీక్ ఇరుక్కోవడం కొత్త ట్విస్ట్. దీనిపై సోషల్ మీడియాలో కార్తీక్/డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న నిరుపమ్ పరిటాల సరదాగా స్పందించాడు.
‘‘గన్‌తో పిక్ పెడితే ‘ఏసేయ్యండి. ఏసేయ్యండి’ అన్నారు. ఇప్పుడు నన్ను ఏసేశారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండీ? దీనికి బాధ్యులు ఎవరండీ? ఎవరు నన్ను బయటకు తీసేది?’’ అని నిరుపమ్ పరిటాల ఓ పోస్ట్ పెట్టాడు. దానికి జైల్లో ఉన్న ఫొటో జత చేశాడు. దీనికి ప్రేక్షకుల్లో చాలామంది చాలా రకాలుగా స్పందించారు.
‘‘త్వరలో కార్తీక దీపం దర్శకుడే ఆ పని చేస్తాడు. అప్పటి వరకూ జైలు జీవితం ఎంజాయ్ చేయండి’’ అని ఓ నెటిజన్ కామెంట్ సెక్షన్‌లో స్పందించాడు. ‘‘వంటలక్క ఉందిగా’’ అని ఇంకొకరు అన్నారు. ‘‘బయటకు ఎందుకు మాస్టారూ... అక్కడే ఉండండి ప్రశాంతంగాగా’’ అన్నారొకరు. ‘‘మీ సౌందర్య అమ్మ వచ్చి మిమ్మల్ని బయటకు తెస్తుంది’’ అని ఒకరు కామెంట్ చేశారు. ఏతావాతా ఈ ఫొటో వైరల్ అవుతోంది.