English | Telugu
మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. తారక్ సందడి మొదలైంది!
Updated : Aug 7, 2021
గతంలో బిగ్ బాస్ షోతో అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రోమోలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షోకి సంబంధించి మరో ప్రోమో వచ్చింది. ఈ షో ఈ నెలలోనే ప్రసారం కానుందని తెలుపుతూ శనివారం ఓ ప్రోమోను విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోమో ఆకట్టుకుంటోంది. స్కూల్ లో పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని టీచర్ అడిగిన ప్రశ్నకు.. కలెక్టర్, పైలెట్, సీఎం అంటూ విద్యార్ధులు రకరకాల సమాధానాలు చెప్పగా.. ఒక అమ్మాయి మాత్రం 'అమ్మను అవుదాం అనుకుంటున్నా' అని చెప్తుంది. పెద్దయ్యాక ఆ అమ్మాయ్యే షోలో తారక్ ముందు హాట్ సీట్‌లో కూర్చునే అవకాశం అందుకొని.. అమ్మ గొప్పతనాన్ని వివరిస్తుంది. ఆ తర్వాత 'ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. కథ మీది, కల మీది.. ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం' అంటూ మీసం మెలేసి తారక్ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
ఇక షో ఆగష్టు నుంచే ప్రసారం కానుందని ప్రోమోలో తెలిపారు. మొదటి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రానున్నారని సమాచారం.