English | Telugu
కామెడీ స్టార్స్ ధమాకాలో నాగబాబు డిసిప్లిన్ రచ్చ
Updated : Mar 20, 2022
బుల్లితెరపై ఆకట్టుకుంటున్న కామెడీ షో `కామెడీ స్టార్స్ ధమాకా`. `స్టార్ మా`లో మెగా బ్రదర్ నాగబాబు రీ ఎంట్రీతో ఈ ప్రోగ్రామ్ రూపురేఖల్నే మార్చేశారు. ముందు కామెడీ స్టార్స్ గా మొదలైన ఈ షో మెగా బ్రదర్ ఎంట్రీతో కామెడీ స్టార్స్ ధమాకా మారిపోయింది. శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రీదేవి వెళ్లిపోయింది. ఆ ప్లేస్ లో నాగబాబు వచ్చేశారు. అంతకు ముందు యాంకర్ గా వర్షిణి సౌందరరాజన్ వుండేది.. ఆ తరువాత శ్రీముఖి వచ్చి చేసింది. ఇప్పుడు ఆ ప్లేస్ లో దీపిక పిల్లిని షోలోకి తీసుకొచ్చారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ఈ షో సాగుతోంది.
అయితే ఈ ఆదివారం మాత్రం ఈ షో కొత్త మలుపు తిరగబోతోంది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలని డామినేట్ చేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ షోని పునః ప్రారంభించారు. అయితే ఈ షోలో కంటెస్టెంట్ ల మధ్య డిసిప్లిన్ లేదని నాగబాబు గమనించారో ఏమోగానీ దాన్ని సెట్రెట్ చేసే కార్యక్రమాన్నే ఈ ఆదివారం ఎపిసోడ్ కింద పెట్టుకున్నారు. ఇందు కోసం స్వయంగా రంగంలోకి దిగిన నాగబాబు బెత్తం పట్టుకుని ఓ రేంజ్ లో కంటెస్టెంట్ లని చితకబాదేశారు.
ముక్కు అవినాష్ ని అయితే ఓ రేంజ్ లో తొడపాశం పెడుతూ రచ్చ రచ్చ చేశారు. నిస్పక్షపాతంగా జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఇందుకు కంటెస్టెంట్ లలో డిసిప్లిన్ కావాలి.. అది రావాలి అంటే మనం ఏం చేయాలి అంటూ చేతిలో వున్న బెత్తానికి పని చెప్పారు. దీంతో కంటెస్టెంట్ లు ఆర్తనాదాలు చేస్తూనే కామెడీని పండించడంతో అక్కడున్న మిగతావారు నవ్వుల్లో మునిగిపోయారు. ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే నాగబాబు స్వయంగా కంటెస్టెంట్ ల మధ్య చిచ్చు పెట్టి మరీ ఒకరిని ఒకరు కొట్టుకునేలా చేయడం. ఓ విధంగా నారదుడిలా మారిన నాగబాబు ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పేసి రివేంజ్ ని ప్లాన్ చేసి మరీ కంటెస్టెంట్ ల వీపు విమానం మోతమోగించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఈరోజే స్టార్ మాలో ప్రసారం కావడం విశేషం.