English | Telugu
అన్ స్టాపబుల్ సీజన్ 3.. ఫస్ట్ గెస్ట్ ఎవరో క్లారిటీ వచ్చింది!
Updated : Oct 10, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి కాగా, రెండు సీజన్లకూ అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు మూడో సీజన్ కి రంగం సిద్ధమైంది. ఈ దసరా నుంచి మూడో సీజన్ ని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే తాజాగా గెస్ట్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసింది.
'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గెస్ట్ లుగా రాగా, రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు, నారా లోకేష్ సందడి చేశారు. ఇక మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ గెస్ట్ లు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సీజన్ 'భగవంత్ కేసరి' మూవీ టీంతో ప్రారంభం కానుందట.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ తోనే అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదలు కానుందట. ఈ ఎపిసోడ్ షూట్ అక్టోబర్ 11న జరగనుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో అనిల్ రావిపూడి, శ్రీలీల, కాజల్ అగర్వాల్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా, అనిల్ రావిపూడి గతంలో బ్రహ్మానందంతో కలిసి ఒకసారి 'అన్ స్టాపబుల్'లో పాల్గొని అలరించాడు. మరి 'భగవంత్ కేసరి' టీంతో బాలయ్య ఏ స్థాయిలో వినోదాన్ని పంచుతారో చూడాలి.
అన్ స్టాపబుల్ సీజన్-3 ని తక్కువ ఎపిసోడ్స్ తో ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎపిసోడ్స్ ఈ సీజన్ లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.