English | Telugu

ఎలిమినేట్ అయిన ఫ‌స్ట్ కంటెస్టెంట్ స‌ర‌యు దృష్టిలో వ‌ర‌స్ట్ కంటెస్టెంట్స్ వీరే!

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5లో ఎలిమినేష‌న్‌కు గురైన ఫ‌స్ట్ కంటెస్టెంట్‌గా నిలిచింది.. స‌ర‌యు రాయ్ అలియాస్ 7ఆర్ట్స్ స‌ర‌యు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఆమె షోకు, హౌస్‌మేట్స్‌కు వీడ్కోలు తెలిపింది. షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ముందుగా, హౌస్‌లో త‌న దృష్టిలో బెస్ట్ అండ్ వ‌ర‌స్ట్ కంటెస్టెంట్స్ ఎవ‌రో చెప్పిందామె.

స‌ర‌యు దృష్టిలో.. సిరి హ‌న్మంత్, వీజే స‌న్నీ, ల‌హ‌రి, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, కాజ‌ల్ వ‌ర‌స్ట్ కంటెండ‌ర్స్‌. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుందంటూ సిరి గురించి చెప్పింది. ష‌ణ్ముఖ్‌, సిరి ఒక ట్యాగ్ టీమ్ అని అభివ‌ర్ణించింది. ప్ర‌తి విష‌యాన్నీ స్కీమ్‌లాగా చూడ‌వ‌ద్ద‌ని ష‌ణ్ముఖ్‌కు చెప్పిన ఆమె, ఎలిమినేష‌న్ ఇంట‌రాక్ష‌న్ సీక్వెన్స్‌లో అత‌ని వెర్ష‌న్ త‌న‌ను ఎంట‌ర్‌టైన్ చెయ్య‌లేద‌ని తెలిపింది. హౌస్‌లో జాగ్ర‌త్త‌గా ఉండ‌మంటూ కాజ‌ల్‌ను హెచ్చ‌రించింది.

వీజే స‌న్నీ, ల‌హ‌రిపై కూడా విరుచుకుప‌డింది స‌ర‌యు. బిగ్ బాస్ 5లో అడుగుపెట్ట‌డానికి ముందు తాము చేసిన ఓ సినిమాలో ఒక డైలాగ్‌ను మార్చ‌డంతో త‌న‌పై స‌న్నీ క‌క్ష క‌ట్టాడ‌నీ, అందుకే త‌న‌ను అత‌ను నామినేట్ చేశాడ‌నీ ఆరోపించింది. స‌న్నీ వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి ట్రై చేసినా, స‌ర‌యు త‌న ఆరోప‌ణ‌ల‌పైనే గ‌ట్టిగా నిల‌బ‌డింది. ల‌హ‌రితో కూడా వాద‌న‌కు దిగిన స‌ర‌యు, ఎదుటివాళ్ల‌ను చిన్న‌చూపు చూడ‌వ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చింది.

ఇక స‌ర‌యు దృష్టిలో శ్వేతావ‌ర్మ‌, మాన‌స్‌, ప్రియాంక‌, విశ్వ బెస్ట్ కంటెస్టెంట్‌లుగా నిలిచారు. ఆమె ఎలిమినేట్ అయ్యాక విశ్వ క‌న్నీరు పెట్టుకోవ‌డం ఆమెను భావోద్వేగానికి గురిచేసింది. విశ్వ ప్ర‌తి డిపార్ట్‌మెంట్‌లోనూ ప‌నిచేస్తే, ప్ర‌తి విష‌యంలోనూ అంద‌రికీ సాయం చేస్తాడ‌ని మెచ్చుకుంది. హౌస్‌లో గ‌డిపిన కొద్ది కాలానికి సంబంధించిన కొన్ని గొడ‌వ‌ల‌ను ఎంచుకుంది స‌ర‌యు. నామినేష‌న్ టాస్కుల స‌మ‌యంలో యాంక‌ర్ ర‌వితో వాద‌న పెట్టుకోవ‌డం, కెప్టెన్సీ టాస్క్ టైమ్‌లో సిరితో గొడ‌వ పెట్టుకోవ‌డం.. వాటిలో ఉన్నాయి. హౌస్‌లోని త‌న ఫ్రెండ్స్ సాయంతోటే సిరి కెప్టెన్సీ టాస్క్‌ను గెలిచింద‌ని ఆమె ఆరోపించింది. త‌న సొంత ప్ర‌తిభ‌తో టాస్క్‌ను గెల‌వాల‌ని సిరికి సూచించింది. ప్రియాంక‌తో గొడ‌వ విష‌యంలో ఉమాదేవికి ఆమె స‌పోర్ట్ ప‌లికింది.

సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే అడ‌ల్డ్ కామెడీ కంటెంట్‌తో పాపుల‌ర్ అయిన న‌టి-యూట్యూబ‌ర్ స‌ర‌యు రాయ్‌, బిగ్ బాస్ హౌస్‌లో త‌న బోల్డ్‌, ముక్కుసూటిత‌నంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. తొలివారంలో నామినేష‌న్ పొందిన ఆరుగురు కంటెస్టెంట్ల‌లో ఒక‌రైన ఆమె, అంద‌రి కంటే ముందుగా ఎలిమినేట్ అయ్యింది.