English | Telugu
బిగ్ బాస్ కంటెస్టెంట్ పై దాడి.. మరీ ఇంత దారుణమా!
Updated : Nov 27, 2023
బిగ్ బాస్ అనేది ఒక షో అయినప్పటికీ దానిని కొందరు సీరియస్ గా తీసుకుంటారు. కంటెస్టెంట్స్ గెలుపుని తమ గెలుపులా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎలిమినేట్ అయితే బాధపడతారు. ఇంకా కొందరైతే కంటెస్టెంట్స్ కి మద్దతుగా ర్యాలీలు కూడా చేస్తారు. అయితే ఇలాంటివన్నీ తెలుగు బిగ్ బాస్ విషయంలో చూశాం. కానీ తమిళ బిగ్ బాస్ ఇంతకు మించి అనేలా ఉంది. తమ అభిమాన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు.
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే తమిళ నటి వనితా విజయ కుమార్ గతంలో బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న తమిళ బిగ్ బాస్ సీజన్-7 లో ఆమె కుమార్తె జోవిక కంటెస్టెంట్ గా ఉంది. అయితే ఇదే సీజన్ లో కంటెస్టెంట్ అయిన ప్రదీప్ ఆంటోనీ బిహేవియర్ పై జోవికతో పాటు ఇతర ఫిమేల్ కంటెస్టెంట్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ప్రదీప్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించేశారు. దీనిపై ప్రదీప్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీతో తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వనితపై దాడి జరిగింది.
తమిళ బిగ్ బాస్-7 గురించి యూట్యూబ్ వేదికగా రివ్యూలు ఇస్తోంది వనిత. అయితే ఆమె రివ్యూలు ప్రదీప్ కి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహించిన ఓ వ్యక్తి వనితపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. ముఖ్యంగా కంటి దగ్గర తీవ్ర గాయమైంది. ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన వనిత.. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో మాత్రమే అని, ఇలాంటి దాదాలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది.