English | Telugu
వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావు.. ఏంటి అంత సీక్రెట్?
Updated : Feb 3, 2022
ఓటీటీ వేదిక ఆహాలో నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో మొదటి సీజర్ చివరి ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4 రాత్రి 8 గంటల నుంచి ఆహాలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన స్పెషల్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.
'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ ముగింపు ఎపిసోడ్ స్పెషల్ ప్రోమోలో బాలయ్య, మహేష్ ల సరదా సంభాషణ ఆకట్టుకుంటోంది. మహేష్ ని చూడగానే 'ఇంత యంగ్ గా ఉన్నవేంటయ్యా బాబు' అని బాలయ్య అనగా.. మహేష్ స్మైల్ ఇచ్చాడు. 'మహేష్ నాదో చిన్న కోరిక.. నా డైలాగ్ నీ గొంతులో వినాలని ఉంది' అని బాలయ్య అడగగా.. 'మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు సార్' అంటూ మహేష్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. 'చిన్నప్పుడు నువ్వు చాలా నాటీ కిడ్ వి అని విన్నాను' అని బాలయ్య అనగా.. మహేష్ సమాధానం చెప్పకుండా సిగ్గుపడ్డాడు. దీంతో 'చేసేవన్నీ చేస్తావు.. చెప్పమంటే మళ్ళీ సిగ్గుపడతావు' అంటూ బాలయ్య నవ్వించాడు.
'ఖలేజా' సినిమాకి ముందు మహేష్ మూడేళ్లు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన బాలయ్య 'సూపర్ స్టార్ గా ఎదిగిన నువ్వు సడెన్ గా మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమేంటి?' అని అడగగా.. 'నన్ను నేను కరెక్ట్ చేసుకోడానికి గ్యాప్ తీసుకున్నాను.. ఆ తర్వాత ఇక తిరిగి ఆలోచించలేదు' అని మహేష్ అనగా.. 'అన్ స్టాపబుల్' అంటూ బాలయ్య ఉత్సాహం నింపాడు. ఇక చివరిలో 'వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసేసుకున్నావు.. ఏంటి అంత సీక్రెట్?' అంటూ బాలయ్య అడిగిన షాకింగ్ క్వశ్చన్ తో ప్రోమో ఎండ్ అయింది.