English | Telugu

 క‌సి, వ‌ల్ల‌భ కుట్ర‌.. సైకిల్ రేస్‌లో న‌య‌ని గెలుస్తుందా?  

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే అరుదైన వ‌రం వున్న ఓ యువ‌తి చుట్టూ సాగే అంద‌మైన క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. అషికా గోపాల్‌, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, ప్రియాంక చౌద‌రి, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, చ‌ల్లా చందు, అనిల్ చౌద‌రి, సురేష్ చంద్ర న‌టించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగే ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు ట్విస్ట్ ల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

గాయ‌త్రిదేవి - న‌య‌ని - విశాల్ ఈ ముగ్గురి పేర్లు క‌లిసేలా `గాన‌వి` ఇండ‌స్ట్రీస్ కి శ్రీ‌కారం చుట్టాల‌ని న‌య‌ని - విశాల్ ఓ నిర్ణ‌యానికి వ‌స్తారు. అయితే కంపెనీ స్టార్ట్ చేయ‌డానికి క‌నీసం ప‌ది ల‌క్ష‌లైనా కావాలి. అలాంటి టైమ్ లో లేడీస్ కోసం సైకిల్ పందెం పోటీలు జ‌రుగుతున్నాయ‌ని, ఇందులో గెలిచిన వారికి ప‌ది ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీ అందుతుంద‌ని పేప‌ర్లో ప్ర‌క‌టన వ‌స్తుంది. అది చూసిన న‌య‌ని సైకిల్ పోటీల‌కు సిద్ధ‌మ‌వుతుంది. విశాల్ వారించినా అత‌న్ని ఒప్పించి రంగంలోకి దిగుతుంది.

అయితే ఈ విష‌యం తెలిసి క‌సి, వ‌ల్ల‌భ‌, తిలోత్త‌మ కుట్ర చేస్తారు. న‌య‌నిని ఈ పోటీలో దెబ్బ‌కొట్టాల‌ని ప‌థ‌కం వేస్తారు. ఇందుకు స్వ‌యంగా వ‌ల్ల‌భ‌, క‌సి రంగంలోకి దిగుతారు. క‌సి కూడా న‌య‌నికి పోటీగా సైకిల్ పందెంలోకి ఎంట‌ర‌వుతుంది. ఇదే స‌మ‌యంలో వ‌ల్ల‌భ వైఫ్ హాసిని, న‌య‌ని చెల్లెలు స‌త్య తో పాటు విశాల్ మేన‌త్త ధురంద‌ర కూడా రంగంలోకి దిగుతుంది. దీంతో న‌య‌ని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తుంది. అంతా క‌లిసి సైకిల్ పోటీలో పాల్గొంటారు. న‌య‌ని పోటీలో ముందుకు వెళ్ల‌డంతో త‌న‌ని దారి త‌ప్పించి తాము ఏర్పాటు చేసిన రౌడీల కంట ప‌డేలా చేస్తారు. అక్క‌డి నుంచి త‌ప్పించుకున్న న‌య‌ని ఎలా త‌న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకుంది? పోటీలో విజేత‌గా నిలిచిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.