English | Telugu

విజయసాయి కాషాయ మంత్రం..జగన్ కు కషాయం!

రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు. ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి అవేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.

ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు. ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు.

అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.

ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.

వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్ ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు. తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ