English | Telugu

దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న వైసీపీ గ్రాఫ్!

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన విపక్షం వైసీపీయే. అందులో సందేహం లేదు. ఎందుకంటే కూటమి పార్టీలు కాకుండా అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీ వైసీపీయే. అటువంటి వైసీపీ పని తీరును కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.

ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 17 నెలలు గడిచింది. ఒకింత ఆలస్యమైనా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. తాము ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పట్ల వారి స్పందన ఎలా ఉంది అన్న అంశంపై అంతర్గతంగా ఒక సర్వే చేయించారు. ఐప్యాక్ పై నమ్మకం సడలిపోయిందో ఏమో కానీ, ఈ సారి విపక్షంగా తన పార్టీ తీరు ఎలా ఉంది అన్నఅంశంపై ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో కూటమి పాలనపైనా, విపక్షంగా వైసీపీ తీరుపైనా సర్వే చేయించారు. అయితే ఈ సర్వే ఫలితంతో జగన్ కు షాక్ తగిలింది.

విపక్షంగా వైసీపీ ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నదే ఈ సర్వే పలితంగా తేలిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఓటమి తరువాత కంటే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా పతనమైందని ఆ సర్వేలో తేలిందంటున్నారు. ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా గల్లంతయ్యేంత ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత.. రాయలసీమలో కూడా వైసీపీ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయిందని ఆ సర్వే పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇక వైసీపీ అధినేత జగన్ పట్ల కూడా ప్రజలలో వ్యతిరేకత గూడుకట్టుకుంటోందని సర్వే తేల్చిం దంటున్నారు. పార్టీ ఓటమి తరువాత రాష్ట్ర వదిలి బెంగళూరులో ప్రవాసం ఉంటున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి గూడుకట్టుకుందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సర్వే ఫలితంతో నైనా జగన్ రెడ్డి తన తీరు మార్చుకుంటారా?