English | Telugu

1700కి.మీ మేర సాగిన ఎవడు విజయయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో శృతీహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా, కాజల్ గెస్ట్ రోల్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎవడు చిత్ర విజయయాత్రకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఎవడు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించి విడుదలైన అన్నిచోట్లా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ.... సక్సెస్ సంబరాల్ని అభిమానుల నడుమ జరుపుకోవాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. ఆ విధంగానే...తమ ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వరుని ఆశిస్సులు తీసుకొని తిరుపతి నుంచి ఎవడు విజయయాత్రను ప్రారంభించారు. ఎవడు చిత్ర యూనిట్ సభ్యులు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్, వంశీ పైడిపల్లి, సాయికుమార్, ఎల్ బి శ్రీరామ్, అజయ్, శశాంక్, రాజ్, సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్, కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ ఈ విజయయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తిరుపతిలో మొదలైన ఈ విజయయాత్ర రాజమండ్రిలో పూర్తయింది. మొదట తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రముఖ హోటల్ కెన్సెస్ లో జరిగిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మొత్తం పాల్గొన్నారు. మీడియా సమావేశం అనంతరం తిరుపతిలోని క్రిష్ణతేజ థియేటర్ ను సందర్శించారు. అక్కడి నుంచి నెల్లూరులోని ఎస్2 థియేటర్లో ఎవడు చిత్ర బృందం సందడి చేసింది. నెల్లూరు నుంచి ఒంగోలులోని గోరంట్ల కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇక్కడ మెగా పవర్ స్టార్ అభిమానులు టపాకాయలతో థియేటర్ ఆవరణాన్ని హోరెత్తించారు.

చిత్ర బృందాన్ని పూలదండల్లో ముంచెత్తారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు చిత్ర బృందాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఒంగోలు నుంచి గుంటూరులోని క్రిష్ణమహల్ థియేటర్ కు రెండో ఆట సమయానికి చేరుకున్నారు. ఆ సమయంలో కూడా అభిమానుల సందడికి హద్దులేకుండా పోయింది. చిత్ర బృందానికి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడినుంచి విజయవాడ రాజ్ థియేటర్లో అభిమానులతో చిత్ర బృందం హడావిడి చేసింది. చిత్ర యూనిట్ ను అభిమానులు పూలమాలలతో సత్కరించారు. ఇలా 17వ తేదీన జరిగిన విజయయాత్ర విజయవంతమైంది. ఆ తర్వాతి రోజు అంటే 18వ తేదీన విజయవాడ స్వర్ణప్యాలెస్ హోటల్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఎవడు యూనిట్ పాల్గొంది. అక్కడి మీడియా సైతం చిత్ర యూనిట్ ను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. విజయవాడ నుంచి భీమవరం బయలుదేరారు. భీమవరం ప్రేక్షకులు చిత్ర యూనిట్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. అక్కడి గీతా మల్టిప్లెక్స్ లో జరిగిన సందడిని చూసేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు.

అక్కడి నుంచి పాలకొల్లులోని గీతా అన్నపూర్ణ థియేటర్లో సందడి చేసింది ఎవడు బృందం. ఆ తర్వాత చివరగా రాజమండ్రి చేరుకుంది ఎవడు యూనిట్. అక్కడి గీతా ఆప్సర థియేటర్లో జరిగిన సక్సెస్ మీట్ కు అనూహ్య స్పందన లభించింది. అలా ఎవడు చిత్ర బృందం దాదాపు 1700 కి.మీ మేర రెండు రోజులు ప్రయాణం చేసింది. సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో... ఎవడు సక్సెస్ టూర్ కూడా అదే విధంగా సూపర్ సక్సెస్ కావడం సంతోషాన్నిచ్చిందని చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సక్సెస్ టూర్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.... "మేం ఊహించిన దానికంటే కూడా ఎవడు పెద్ద విజయం సాధించి మా అందరికీ సంక్రాంతి కానుక అందించింది. ఎవడు మా రెండేళ్ల కష్టం. సినిమా పూర్తయినా వివిధ కారణాలతో విడుదల ఆలస్యమైంది. లేటుగా వచ్చినా... దానికి తగ్గట్టుగానే భారీ కలెక్షన్లు సాధిచింది. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. మా బ్యానర్లో వచ్చిన 16వ సినిమా ఇది. కానీ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా తీయలేదనే వెలితి మాకు ఉండేది. ఆ లోటు ఎవడుతో తీరింది. మా బ్యానర్లో కమర్షియల్ సక్సెస్ అందించిన వంశీకి థాంక్స్ చెబుతున్నా. మెగా పవర్ స్టార్ రాంచరణ్ యాక్టింగ్, డ్యాన్సులు, ఫైట్లకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బన్నీ ఈ సినిమా చేయడం హాట్సాఫ్. ఆయన సినిమాలో కొద్దిసేపే కనిపించినా కథలో ట్రావెల్ చేశాడు. ఆయనకు కూడా స్పెషల్ థాంక్స్. సాయికుమార్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు థియేటర్లలో జనాలు విజిల్స్ వేస్తున్నారు. థర్మ క్యారెక్టర్లో ఆయన జీవించాడు. అజయ్, జయసుధ, శశాంక్, ఎల్ బి శ్రీరామ్, రాజ్ ఇలా ప్రతీ పాత్రకు ప్రాధాన్యముంది. అందరికీ మంచి పేరొచ్చింది. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకుల నడుమ విజయ యాత్ర చేసుకోవాలనే ఇంత దూరం వచ్చాం. మరోసారి మెగా అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా". అని అన్నారు.

సక్సెస్ టూర్ లో సాయికుమార్ మాట్లాడుతూ.... "ఈరోజు ఎవడు గురించి ఇంతగా మాట్లాడుతున్నారంటే కారణం మా దర్శకుడు వంశీ పైడిపల్లికే ఆ క్రెడిట్ దక్కుతుంది. రాంచరణ్ పవర్ ప్యాక్ డ్ పెర్ ఫార్మెన్స్ హైలైట్. బన్నీ ఈ సినిమాకు ప్రాణం పోశాడు. ఇది స్క్రీన్ ప్లే బేస్ డ్ సినిమా. ఇలాంటి సినిమాలో నాకు ధర్మ వంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు. ఈ పాత్ర కోసం స్పెషల్ కేర్ తీసుకున్నాడు డైరెక్టర్. నాకు ఈ పాత్ర సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదనే చెప్పాలి. నాకు రాంచరణ్ కు మధ్య, నాకు జయసుధకు మధ్య వచ్చే సన్నివేశాలకు వస్తున్న భారీ స్పందన చూస్తుంటే చాలా సంతోషాన్నిస్తోంది. ప్రేక్షకుల్ని మెప్పించే ఇలాంటి పాత్రలతో మిమ్మల్ని అలరిస్తానని ఈ సందర్భంగా చెబుతున్నా". అని అన్నారు.

సక్సెస్ టూర్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.... "ముందుగా అభిమానులకు చేతులెత్తి దండంపెడుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇంతటి ఘనవిజయం అందించి ఉండకపోతే మీముందుకు వచ్చేవాళ్లమే కాదు. ఈరోజు థియేటర్లో ప్రతీ పాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నిర్మాతలు, హీరోలు. వారు లేకుంటే ఈ సినిమా లేదు. ముఖ్యంగా రాంచరణ్ డేడికేషన్, బన్నీ కమిట్ మెంట్ సూపర్. వారిద్దరి సహకారం మరువలేను. అలాగే సాయికుమార్ గారి ధర్మ క్యారెక్టర్, ఎల్ బి శ్రీరామ్ తమ పాత్రలకు ప్రాణం పెట్టారు. అందుకే అంత సహజంగా వచ్చాయి. జయసుధ గారి పాత్ర మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇంతటి భారీ విజయాన్నిచ్చిన మీ అందరికీ మరోసారి థాంక్స్". అని అన్నారు.

సక్సెస్ టూర్ లో ఎల్ బి శ్రీరాం మాట్లాడుతూ... "నన్ను కమెడియన్ గా ఆదరించారు. ఎవడులో నేను చేసిన పాత్ర నా కెరీర్ కి ప్రత్యేకం. ఇలాంటి పాత్రలు ఎప్పడోగాని దొరకవు. నేను దాదాపు ముప్పైరోజులు ఈ సినిమా కోసం పని చేశాను. నేను బాగా చేశాను అనే కంటే.... దర్శకుడు నానుంచి రాబట్టుకున్నాడని చెప్పాలి. భారీ చిత్రాలు నిర్మించే దిల్ రాజు గారి బ్యానర్లో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా". అని అన్నారు.

సక్సెస్ టూర్ లో అజయ్... "అభిమానుల సందడి చూస్తుంటే చాలా సంతోషమేస్తుంది. ఎవడు సూపర్ సక్సెస్ ను మీ అందరి మధ్య చేసుకోవడం చాలా హ్యాపీ. సూపర్ హిట్ ఎవడు చిత్రంలో నన్ను భాగస్వామిని చేసినందుకు మా డైరెక్టర్ కు, నిర్మాతలకు థాంక్స్ చెప్పాల్సిందే. అలాగే సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్". అని అన్నారు.

సక్సెస్ టూర్ లో శశాంక్ మాట్లాడుతూ... "ఎల్ బి శ్రీరామ్ తనయుడిగా నాకు మరిచిపోలేని పాత్ర ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నా. కొద్దిసేపే ఉన్నా... నా పాత్రకు ప్రాధాన్యమిచ్చారు దర్శకుడు. నా క్యారెక్టర్ ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందిరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా". అని అన్నారు.

సక్సెస్ టూర్ లో రాజ్ మాట్లాడుతూ... "నాకు ఇందులో రెండు షేడ్స్ ఉండే పాత్ర దొరికింది. పెద్ద బ్యానర్లో ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. బన్నితో, చెర్రీతో ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ దొరికింది. నా పాత్రకు మంచి అప్లాజ్ వస్తోంది". అని అన్నారు.

సక్సెస్ టూర్ లో సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాట్లాడుతూ... "ఈరోజు సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిందంటే కారణం నిర్మాత, దర్శకుడు, ఆర్టిస్టులకే ఆ క్రెడిట్ దక్కుతుంది. కెమెరా వర్క్ చాలా బాగుందని ప్రశంసిస్తున్న మెగాభిమానులందరికీ థాంక్స్. దర్శకుడు వంశీకి కథ మీద మంచి క్లారిటీ ఉంది. దీంతో మా పని సులువైంది". అని అన్నారు.

సక్సెస్ టూర్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాట్లాడుతూ.... "రాంచరణ్ ఫ్రీడమ్ సాంగ్ లో ఇరగదీశాడు అనే కామెంట్స్ వింటుంటే నాలో ఎనర్జీ మరింత పెరుగుతోంది. ఈ పాటకోసం చెర్రీ చాలా కష్టపడ్డాడు. తన నుంచి ఫ్యాన్స్ ఎలాంటి స్టెప్ట్స్ ఆశిస్తారో ఆయనకు తెలుసు. అందుకే డ్యాన్స్ గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. చెర్రీ లాంటి స్టార్ డ్యాన్సర్ కి కొరియోగ్రఫీ చేయడాన్ని నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నా". అని అన్నారు.