English | Telugu
విజయ్ దేవరకొండ మూవీకి బ్రేక్.. మరో సినిమాతో డైరెక్టర్ బిజీ!
Updated : Nov 10, 2023
విజయ్ దేవరకొండ తన 12వ సినిమాని దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానికంటే ముందు, తన 13వ సినిమాగా ప్రకటించిన 'ఫ్యామిలీ స్టార్'ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు విజయ్. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం విజయ్ దృష్టి అంతా ఈ ప్రాజెక్ట్ పైనే ఉంది. విజయ్ 'ఫ్యామిలీ స్టార్'తో బిజీగా ఉండటంతో గౌతమ్ మరో సినిమాని తెరకెక్కించే పనిలో పడిపోయాడు.
విజయ్ 'ఫ్యామిలీ స్టార్'ని పూర్తి చేసేలోపు.. తానొక చిన్న సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడట గౌతమ్. కొత్త వాళ్ళతో చేస్తున్న ఈ సినిమాని కూడా సితారనే నిర్మిస్తుండటం విశేషం. 'నాన్న', 'పొన్నియిన్ సెల్వన్' ఫేమ్ సారా అర్జున్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. గౌతమ్ రెండో సినిమా 'జెర్సీ'తో పాటు 'VD12'కి అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్. తమిళ్, తెలుగులో బడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనిరుధ్.. గౌతమ్ చేస్తున్న చిన్న సినిమాకి సైతం సంగీతం అందిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
సారా అర్జున్ తో దర్శకుడు గౌతమ్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతోందట. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది పూర్తయ్యాక విజయ్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు గౌతమ్.