English | Telugu

‘హాయ్‌ నాన్న’ ఈవెంట్‌లో విజయ్‌, రష్మిక.. షాక్‌ అయిన యూనిట్‌!

ప్రేక్షకులు, ఇండస్ట్రీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హాయ్‌ నాన్న’. నాని, మృణాల ఠాకూర్‌ జంటగా నటించిన ఈ సినిమాని శౌర్యువ్‌ అనే నూతన దర్శకుడు రూపొందించాడు. డిసెంబర్‌ 7న ఈ సినిమా రిలీజ్‌ అవుతుండగా, ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరించింది. ఈ ఈవెంట్‌లో ఓ సంఘటన అందర్నీ షాక్‌కి గురిచేసింది. అక్కడికి వచ్చిన ఆడియన్స్‌, నాని, మృణాల్‌తో సహా చిత్ర యూనిట్‌ కూడా ఒక్కసారిగా షాక్‌ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి ఎల్‌ఇడి స్క్రీన్‌పై కొందరి ఫోటోలను చూపించి వాటిపై తమ అభిప్రాయాలను చెప్పాలంటూ నాని, మృణాల్‌లను కోరింది సుమ.

ఆ క్రమంలోనే సడన్‌గా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ఒకే స్పాట్‌లో వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఫోటో ప్రత్యక్షమైంది. దీంతో అక్కడున్న వారంతా షాక్‌ అయ్యారు. వెంటనే సుమ అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్‌పై సీరియస్‌ అయింది. అతని కాలర్‌ పట్టుకొని ‘రేయ్‌ నువ్వేనా ఆ ఫోటోలు తీసింది. ఇలాంటి పిక్చర్స్‌ తీయొచ్చా? ఎంత సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ అయినా ప్రైవసీ ఉండదా? ఏ ఫోటో అయినా పెట్టేస్తారా?’ అంటూ ఫైర్‌ అయింది. అంతే.. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్‌ ఈవెంట్స్‌లో సెలబ్రిటీల పర్సనల్‌ పిక్స్‌ చూపించడం ఎంత వరకు కరెక్ట్‌ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విజయ్‌, రష్మిక లవ్‌లో ఉన్నారని ఆధారాలతో సహా చూపేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడీ ఫోటో బహిరంగంగా ప్రదర్శించడంతో ఆ రూమర్‌కి మరింత బలం చేకూరినట్టయింది. ఏది ఏమైనా సెలబ్రిటీల పర్సనల్‌ ఫోటోలను పబ్లిక్‌ ముందు ఉంచి వారి మనోభావాలను దెబ్బతియ్యడం సరైనది కాదు అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.