English | Telugu
వెంకీ మామ విశ్వరూపం.. వామ్మో ఇంత వయలెన్స్ ఏంటి!
Updated : Jan 3, 2024
విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సైంధవ్'. ఇది వెంకటేష్ 75వ చిత్రం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
వయలెన్స్, ఎమోషన్స్ కలగలిసిన 'సైంధవ్' ట్రైలర్ అదిరిపోయింది. వెంకటేష్ మ్యానరిజమ్స్ ని పాప ఇమిటేట్ చేసే సన్నివేశంతో ట్రైలర్ క్యూట్ గా ప్రారంభమైంది. "మా నాన్న సూపర్ హీరో.. నాన్న ఉంటే భయం వేయదు" అని పాప వాయిస్ వస్తుండగా.. ఒకవైపు యాక్షన్ సన్నివేశాలు, మరోవైపు బ్యూటిఫుల్ ఫ్యామిలీ సన్నివేశాలను పారలల్ గా చూపిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా నడిచింది. పాపకి అరుదైన వ్యాధి రావడం, ట్రీట్మెంట్ కోసం రూ.17 కోట్లు కావాల్సి ఉండటంతో ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. హీరో గతం ఏంటి?, వయలెన్స్ ని వదిలి సాధారణ జీవితం గడపడానికి కారణమేంటి?, పాప ట్రీట్మెంట్ డబ్బుల కోసం మళ్ళీ వయలెన్స్ బాట పడితే 'సైకో ఈజ్ బ్యాక్' అంటూ కొన్ని గ్యాంగ్ లు ఎందుకు భయపడుతున్నాయి? వంటి ఆసక్తికర ప్రశ్నలను రేకెత్తిస్తూ నడిచిన ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ లో వెంకటేష్ స్క్రీన్ ప్రజెన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అన్నీ మెప్పిస్తున్నాయి.
ఫ్యామిలీ హీరోగా ముద్ర ఉన్న వెంకటేష్ అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలతో అలరిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఈ రేంజ్ వయలెన్స్ ఉన్న సినిమా రాలేదనే చెప్పాలి. 'ఘర్షణ', 'లక్ష్మీ', 'తులసి' వంటి సినిమాల్లోని ఫైట్స్ సీన్లకు, ఎన్నో రెట్లు మించిన వయలెన్స్ 'సైంధవ్'లో ఉండబోతుందని ట్రైలర్ ని బట్టి అర్ధమవుతోంది. కొన్ని కొన్ని ఫైట్ సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. అసలే ఈ మధ్య వయలెన్స్, ఎమోషన్స్ తో కూడిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. 'సైంధవ్'తో వెంకటేష్ కూడా అలాంటి మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.