English | Telugu

‘వారణాసి’తో తెలుగు సినిమాకి ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన చాలా అప్‌డేట్స్‌ ఒక్కసారే బయటికి తీసుకొచ్చారు మేకర్స్‌. ఈ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఒక వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. రామోజీ ఫిలింసిటీలో ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ ఈవెంట్‌లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడారు.

‘నన్ను, మహేష్‌ని కలిపినందుకు కె.ఎల్‌.నారాయణగారికి థాంక్స్‌. నేను చేసిన కొన్ని సినిమాలకు రిలీజ్‌కి ముందే కథ చెప్పాను. ఈ సినిమా విషయానికి వస్తే మాటల్లో చెప్పడానికి కుదరదు. ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్పకుండా ఒక వీడియో ద్వారా చెబుదామనుకున్నాము. మార్చిలోనే ఈ వీడియో రిలీజ్‌ చేద్దామనుకున్నాం. చివరికి నవంబర్‌ 15కి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం.

చిన్నప్పుడు నాకు కృష్ణగారి గొప్పతనం గురించి తెలీదు. ఆ తర్వాత తెలిసింది. ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చెయ్యాలంటే ఎన్నో అడ్డంకుల్ని తొలగించుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్లాలి. అలాంటిది కృష్ణగారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్‌ను తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్‌ చేశారు. మొదటి ఈస్ట్‌మన్‌ కలర్‌ సినిమా, మొదటి సినిమా స్కోప్‌ సినిమా, మొదటి 70ఎంఎం సినిమా.. ఇలా అన్ని టెక్నికల్‌గా చాలా వాటిని మనకు పరిచయం చేశారు. అలాంటి కృష్ణగారి అబ్బాయి మహేష్‌తో సినిమా చేస్తూ.. ఎంతో గర్వంగా చెబుతున్నాము.. మేం ఒక కొత్త టెక్నాలజీని తెలుగు సినిమాకి పరిచయం చేస్తున్నాం. ప్రీమియం లార్జ్‌ స్కేల్‌ ఫార్మాట్‌ ఫిల్మ్‌డ్‌ ఫర్‌ ఐమాక్స్‌. ఇప్పటివరకు మనం చేసిన సినిమాస్కోప్‌ మూవీస్‌ని బ్లోఅప్‌ చేసి ఐమాక్స్‌ బ్రాండ్‌ వేసుకొని చూస్తుంటాం. అది నిజమైన ఐమాక్స్‌ కాదు. ఈ సినిమాని 1:1.9 ఫార్మాట్‌లో షూట్‌ చేసి అసలైన ఐమాక్స్‌ ఫార్మాట్‌లో చేశాం’ అంటూ ట్రైలర్‌ని ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించారు.