English | Telugu

సినిమాల కోసం జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసాడు!

డాక్టర్ కాబోయి యాక్టర్ అయినవాళ్ళని చూసుంటాం. అలాగే సినిమాల కోసం, నటన కోసం సాఫ్ట్ వేర్ జాబో లేక మరో ఉద్యోగమో వదిలేసిన వాళ్ళ గురించి వినుంటాం. కానీ సినిమాల కోసం ఏకంగా జాయింట్ కలెక్టర్ జాబ్ ని వదిలేసిన వారి గురించి విన్నారా?. తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడు అదే పని చేశారు. వైజాగ్ జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్న ఆయన.. సినిమాల కోసం ఏకంగా ఆ పెద్ద ఉద్యోగాన్ని, హోదానే వదిలేశారు. ఆయన ఎవరో కాదు వడ్లమాని సత్య సాయి శ్రీనివాస్.

వడ్లమాని శ్రీనివాస్ కి చిన్న వయసు నుంచి సినిమాల మీద, సాహిత్యం మీద మక్కువ ఉంది. కానీ ఆయనకు నటుడు కావాలనే ఆలోచన లేదు. అయితే జాయింట్ కలెక్టర్ గా ఉన్న సమయంలో ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కోసం 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో సరదాగా చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత దర్శకుడు మారుతి 'మహానుభావుడు'లో మంచి పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత 'గీత గోవిందం', 'ప్రతిరోజూ పండగే', 'ఎఫ్-2' ఇలా వరుస అవకాశాలు వచ్చాయి. సినిమాలు హిట్ అవ్వడం, పాత్రలకు మంచి పేరు రావడంతో అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఆయన ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ సమయంలోనే 60 కి పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం పలు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆయన నటించిన 'భగవంత్ కేసరి' విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.