English | Telugu

సచిన్‌ టెండూల్కర్‌తో తమన్‌.. ఇద్దరూ కలిసి ఏం చెయ్యబోతున్నారో తెలుసా?

తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తూ టాప్‌ హీరోలకు మ్యూజికల్‌ హిట్స్‌ ఇస్తున్న తమన్‌ తాజాగా చేసిన పోస్ట్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇండియన్‌ క్రికెట్‌ సెన్సేషన్‌ సచిన్‌ టెండూల్కర్‌ను తమన్‌ ఇటీవల కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. స్వతహాగా క్రికెట్‌ అభిమాని అయిన తమన్‌.. సచిన్‌తో తన ప్రయాణాన్ని ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌తో ప్రయాణం’ అంటూ కోట్‌ చేశారు.

సచిన్‌తో ప్రయాణం తమన్‌కి అనుకోకుండా లభించిన అదృష్టం. ఆ సమయంలోనే తను సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో ఆడిన బ్యాటింగ్‌ క్లిప్‌లను సచిన్‌కు చూపించానని, అవి చూసి తన బ్యాటింగ్‌ను అప్రిషియేట్‌ చేశాడని తెలిపారు. ‘మీ బ్యాట్‌ స్పీడ్‌ అద్భుతంగా ఉంది’ అని తనను మెచ్చుకోవడం చాలా సంతోషాన్ని కలిగించిందని తమన్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతే కాదు, త్వరలో సచిన్‌తో కలిసి పనిచేస్తాను అన్నాడు. అయితే వీరిద్దరూ కలిసి పనిచేయడం ఏమిటి అనే సందేహం నెటిజన్లకు కలిగింది. ఎందుకంటే ఇద్దరి రంగాలు వేరు. తమన్‌ సంగీతంలో బిజీగా ఉంటాడు. సచిన్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిపోయి ప్రస్తుతం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. మరి వీరిద్దరూ కలిసి ఏవిధంగా పనిచేస్తారు అనే ప్రశ్న అందరి మనసులోనూ ఉంది. ఇద్దరూ కలిసి పనిచేసే ఆ ప్రాజెక్ట్‌ ఏమిటి? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంలో తమన్‌ క్లారిటీ ఇస్తాడా? లేక అనాలోచితంగా ఆ మాట అన్నాడా అనేది తెలియాల్సి ఉంది.