English | Telugu

'పెళ్ళి సందD' 2 'గుంటూరు కారం'.. శ్రీలీల అరుదైన పండగల రికార్డు!

తెలుగునాట క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది శ్రీలీల. టాలీవుడ్ లో ఇప్పటివరకు రెండే రెండు సినిమాలతో వెండితెరపై సందడి చేసిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. వీటిలో ఐదు సినిమాలు ఐదు నెలల పాటు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. విశేషమేమిటంటే.. ఇవన్నీ కూడా పండగ సీజన్స్ లోనే తెరపైకి రాబోతున్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. రామ్ కి జోడీగా శ్రీలీల నటించిన పాన్ ఇండియా మూవీ 'స్కంద'. ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న రాబోతోంది. అలాగే బాలకృష్ణ కూతురిగా శ్రీలీల యాక్ట్ చేస్తున్న 'భగవంత్ కేసరి' దసరా స్పెషల్ గా అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమైంది. అదే విధంగా వైష్ణవ్ తేజ్ సరసన నటించిన 'ఆదికేశవ' దీపావళి కానుకగా నవంబర్ 10న తెరపైకి వస్తోంది. ఇక నితిన్ కి జంటగా నటిస్తున్న'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23న, మహేశ్ బాబు జతగా కనిపించనున్న 'గుంటూరు కారం' సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12న వినోదాలు పంచనున్నాయి.

ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. శ్రీలీల తొలి రెండు సినిమాలు 'పెళ్ళి సందD', 'ధమాకా' కూడా గతంలో ఫెస్టివల్ స్పెషల్ గానే రిలీజయ్యాయి. 'పెళ్ళి సందD' 2021 దసరాకి ఎంటర్టైన్ చేయగా.. 'ధమాకా' 2022 క్రిస్మస్ సీజన్ లో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. సో.. 'పెళ్ళి సందD' నుంచి 'గుంటూరు కారం' వరకు వరుసగా ఏడు సినిమాలు ఫెస్టివల్ సీజన్స్ లోనే రిలీజ్ కావడం అనేది శ్రీలీలకి అరుదైన రికార్డు అనే చెప్పాలి. మరి.. 'పెళ్ళి సందD', 'ధమాకా'తో ఫెస్టివల్ హిట్స్ అందుకున్న శ్రీలీల.. రాబోయే సినిమాలతోనూ ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.