English | Telugu

‘అరసన్‌’ కోసం కత్తి పట్టిన శింబు.. మరి ధనుష్‌కి సంబంధమేంటి?

ఎస్‌టిఆర్‌49గా వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఓ డిఫరెంట్‌ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శింబు నటిస్తున్న 49వ సినిమా ఇది. సాధారణంగా వెట్రిమారన్‌ వర్క్‌ చాలా స్పీడ్‌గా ఉంటుందని అంటారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా షూటింగ్‌ కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకి ‘అరసన్‌’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. గతంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘వాడ చెన్నయ్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌ అనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై వెట్రిమారన్‌ స్పందిస్తూ ‘శింబు కోసం సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్న కథ ఇది. వాడ చెన్నయ్‌ చిత్రానికి ఇది సీక్వెల్‌ అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘అరసన్‌’ చిత్రం ఉండబోతోంది. అరసన్‌ అంటే రాజు అని అర్థం. ఇలాంటి మాస్‌ ఎంటర్‌టైనర్స్‌లో శింబు ఎలా రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే. దానికి వెట్రిమారన్‌ వంటి డైరెక్టర్‌ కూడా తోడైతే సినిమా ఒక రేంజ్‌లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అరసన్‌’కి సంబంధించిన పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. శింబు కత్తి పట్టుకొని సైకిల్‌ పక్కన నిలబడిన స్టిల్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్‌లో శింబు ఫేస్‌ కనిపించకపోయినా అతని గెటప్‌ చూస్తే పూర్తి మాస్‌ లుక్‌లో ఉన్నాడు. అయితే అతని చేతిలో ఉన్న కత్తిని మాత్రం నెటిజన్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆ కత్తి వాడ చెన్నయ్‌ చిత్రంలో ధనుష్‌ వాడిన కత్తిని పోలి ఉంది. అందుకే వాడ చెన్నయ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగానే అరసన్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా శింబుకి ఇది పర్‌ఫెక్ట్‌ సినిమా అని ఫ్యాన్స్‌ చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండగా, కలైపులి ఎస్‌. థాను నిర్మిస్తున్నారు.