English | Telugu
50 శాతం ఆక్యుపెన్సీ.. అయినా 'క్రాక్' ఓపెనింగ్స్ అదిరాయి!
Updated : Jan 11, 2021
రవితేజ కసితీరా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తున్నాడు. ఆయన టైటిల్ రోల్ పోషించిన యాక్షన్ థ్రిల్లర్ 'క్రాక్' ఓపెనింగ్స్ అదరగొట్టాయి. శ్రుతి హాసన్ నాయికగా, సముద్రకని విలన్‌గా నటించగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ విడుదలకు ఆటంకాలు ఎదురైన విషయం తెలిసిందే. నిర్మాత బి. మధు మునుపటి తమిళ చిత్రం 'అయోగ్య'కు సంబంధించిన ఆర్థిక సమస్యలు మెడకు చుట్టుకోవడం, వాటిని సకాలంలో పరిష్కరించుకోవడంలో ఆయన విఫలం కావడంతో జనవరి 9న ఉదయం 8:45 గంటల షోతో విడుదల కావాల్సిన 'క్రాక్'.. రాత్రి 10:30 గంటలకు సెకండ్ షోతో మొదలైంది. దాంతో కోట్లాది రూపాయల ఓపెనింగ్స్‌ను అది కోల్పోయినట్లయింది.
అయినప్పటికీ పాజిటివ్ టాక్ రావడం, రివ్యూలలో ఎక్కువగా సినిమాని ప్రశంసించడంతో జనవరి 10న 'క్రాక్' క్యారెక్టర్‌లో రవితేజను చూసేందుకు ఫ్యాన్స్, మాస్ మూవీ లవర్స్ థియేటర్ల దగ్గర బారులు తీరారు. 'క్రాక్'కు భూమ్ బద్దల్ ఓపెనింగ్స్ వచ్చాయంటూ నిర్మాతలు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఫిగర్స్ మాత్రం వారు వెల్లడించలేదు.
కాగా, అనధికార సమాచారం ప్రకారం మునుపటి రోజు నైట్ షోస్‌తో కలిపి ఆదివారం నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.50 కోట్ల గ్రాస్ వసూలైందంటున్నారు. షేర్ విషయానికి వస్తే.. రూ. 6 కోట్లు దాటిందని చెప్తున్నారు. అదే నిజమైతే.. 50 శాతం ఆక్యుపెన్సీతో ఈ రేంజి వసూళ్లు రావడం గొప్ప విషయంగా చెప్పాలి. రవితేజ సినిమాలకు సంబంధించి ఇవి బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్.
ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కాబట్టి వసూళ్ల ఉధృతం 13వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత రామ్ సినిమా 'రెడ్', బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' సినిమాలకు థియేటర్లను అప్పగించాల్సి వస్తుంది కాబట్టి కలెక్షన్లు పడిపోతాయి. మంచి టాక్ వల్ల ఈ మూడు రోజులు కూడా వసూళ్లు బాగా వస్తే.. సినిమాకు కచ్చితంగా మేలు జరుగుతుంది. ఏదేమైనా పాజిటివ్ టాక్, భారీ ఓపెనింగ్స్ రావడంతో రవితేజ, గోపీచంద్ జోడీ హుషారుగా ఉంది. 'క్రాక్'తో హ్యాట్రిక్ హిట్ సాధించామనే ఆనందాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు వారి కలయికలో 'డాన్ శీను', 'బలుపు' సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.