English | Telugu

రవితేజ తన వారసుడి విషయంలో ఏం చేయనున్నాడు?

సినిమా హీరోలుగా ఎదగాలనుకునే వారు కెరీర్ ప్రారంభంలో పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. అందులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటులవ్వాలనుకున్న వారికి ఎదురయ్యే కష్టాలు చెప్పన‌ల‌వి కావు. దాంతో వారికి వారసత్వం పై ఒక విధమైన ఏహ్య‌భావం వస్తుంది. రవితేజ కూడా ఖడ్గం సినిమాలో దీనికి సంబంధించిన పలు డైలాగ్స్, అలాగే నేనింతే చిత్రంలో కూడా సెటైర్లు పేల్చిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి లాగానే రవితేజ కూడా తన ఓన్ టాలెంట్ తో స్టార్ డమ్ ను అందుకున్నారు. అయితే రవితేజ తాను త‌న‌లాగానే త‌న వార‌సుడు క‌ష్ట‌ప‌డి అవ‌కాశాలు సాధించి స్టార్ కావాల‌ని కోరుకుంటారా? తన వారసుడు కూడా సొంతంగా కష్టపడి హీరోగా ఎదగాలనుకుంటున్నారా లేక తన వారసత్వాన్ని లెగసిని తన కుమారుడికి అందజేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక టాలీవుడ్ లో వారసుల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రేజీ స్టార్స్‌ వారసులు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు అత్యధిక శాతం కనిపిస్తూ ఉంటారు. చిరు ఫ్యామిలీ నుంచి ఇప్పుడే వారసులు పదుల సంఖ్యలో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ హీరోలు ముగ్గురు మాత్రమే రాణిస్తున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఇద్దరు హీరోలు ఉండగా మూడో హీరో త్వరలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో నాగ్‌ తో కలిపి మొత్తం ఐదుగురు ఉన్నారు. నాగ్‌ తరువాత మిగతావారు స్టార్‌ స్టేటస్ కోసం పోటీ పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి కూడా వారసుడు రెడీ అవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

రవితేజ తనయుడు మహాధన్ హీరోగా పరిచయం కాబోతున్నాడని, ఇడియట్ 2మూవీ ద్వారా ఆయన ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. 2002లో అంటే 20 ఏళ్ల కిందట పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఇడియట్ నాడు ఓ స్థాయిలో సంచలనం సృష్టించి మాస్ రవితేజకు హీరోగా ఎనలేని గుర్తింపును తెచ్చి పెట్టింది. అంతేకాదు ఆయనకంటూ ఒక సపరేట్ బాడీ లాంగ్వేజ్ ని, యాక్టింగ్ స్టైల్ ను ఏర్పరిచింది. అలాంటి హిట్ సినిమా సీక్వెల్ తోనే ఆయ‌న తను వార‌సుడిని పరిచయం చేయబోతున్నాడని మీడియాలో క‌థ‌నాలు వస్తున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో దీనిపై రవితేజ స్పందిస్తూ మీ అబ్బాయిని ఇడియట్‌2 సినిమాతో పరిచయం చేయబోతున్నారని అందరూ ఎదురు చూస్తున్నారు అన్న ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పారు. అలాంటిదేమీ లేదు.... వినడానికే చాలా కొత్తగా ఉంది అని అన్నారు. ఈ మాటలు విన్న మైత్రి నిర్మాత రవిశంకర్ మహా దన్ ఇంకా చిన్నవాడు అని చెప్పుకొచ్చారు. అంటే రవితేజ తనయుడు ఎంట్రీకి ఇంకా టైముంది అన్నమాట. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ మూవీ లో ఆయన తనయుడు మహాధ‌న్‌ చిన్ననాటి మాస్ రాజా క్యారెక్టర్ లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. మరి రవితేజ తన కుమారుడిని స్వయంకృషితో ఎదగమని చెప్తాడా తన లెగసిని అందుకుని ముందుకు సాగమని చెప్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే నీతులు పక్క వారికే గాని మనకు కాదనే పెద్దల‌ సామెత ఉంది. మరి దీన్ని రవితేజ నిజం చేస్తాడా? లేక‌ ఈ సామెత తప్పని నిరూపిస్తాడా అనేది వేచి చూడాలి.