English | Telugu

'పుష్ప' హిందీ వెర్ష‌న్‌కు సెన్సార్ ట్ర‌బుల్‌!

అల్లు అర్జున్ టైటిల్ పాత్ర‌ధారిగా, సుకుమార్ రూపొందించిన 'పుష్ప‌: ది రైజ్' డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది. తెలుగులో నిర్మాణ‌మైన ఈ మూవీని త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో డ‌బ్ చేసిన విడుద‌ల చేస్తున్నారు. అయితే మిగ‌తా భాష‌ల్లో సెన్సార్ ప‌నులు పూర్త‌యిన ఈ సినిమా హిందీ వెర్ష‌న్‌కు ఇంత‌దాకా సెన్సార్ స‌ర్టిఫికెట్ ల‌భించ‌లేదు. నార్త్ బెల్ట్‌లోనూ 'పుష్ప‌'కు మంచి హైప్ క్రియేట్ కాగా, ఫ్యాన్స్ ఎప్పుడు ఆ సినిమా త‌మ ముందుకు వ‌స్తుందా అనే అమితమైన క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

హిందీ వెర్ష‌న్ ఫైన‌ల్ ప్రింట్ స‌కాలంలో చేతికి రాక‌పోవ‌డంతో సెన్సార్ బోర్డుకు అనుకున్న స‌మ‌యానికి అందించ‌లేక‌పోయారు నిర్మాత‌లు. మొద‌ట అన్‌ఫినిష్డ్ వెర్ష‌న్‌ను బోర్డుకు పంప‌గా, అధికారులు దాన్ని తిల‌కించేందుకు నిరాక‌రించారు. ఆ త‌ర్వాత నిర్మాత‌లు ఫైన‌ల్ ప్రింట్‌ను బోర్డుకు అంద‌జేశారు. ఈరోజు ముంబైలోని సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్స్ 'పుష్ప‌'ను చూసి, క్లియ‌రెన్స్‌ను ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

సోమ‌వారం దాకా సుకుమార్‌, ఆయ‌న టీమ్ హిందీ వెర్ష‌న్‌కు సంబంధించిన కొన్ని క‌రెక్ష‌న్స్‌ను చేయ‌డంలో నిమ‌గ్న‌మై ఉండ‌టం వ‌ల్లే దాన్ని స‌కాలంలో సెన్సార్ బోర్డుకు అందించ‌లేక‌పోయార‌ని తెలుస్తోంది. మొద‌ట్నుంచీ హిందీ వెర్ష‌న్‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. 'పుష్ప' హిందీ వెర్ష‌న్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసే ఉద్దేశంతోనే ఆ సినిమా హ‌క్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూట‌ర్లు థియేట‌ర్ల‌లో దాన్ని విడుద‌ల చేయ‌డానికి మొద‌ట నిరాక‌రించారు. అల్లు అర్జున్ జోక్యం చేసుకొని న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించ‌డానికి అంగీక‌రింప‌జేసి, థియేట‌ర్ల‌లో సినిమాను రిలీజ్ చేయించ‌డానికి ఒప్పించాడు.

అయిన‌ప్ప‌టికీ ముంబై, ఢిల్లీ, ఇత‌ర న‌గ‌రాల్లోని మ‌ల్టీప్లెక్సులు హాలీవుడ్ ఫిల్మ్ 'స్పైడ‌ర్‌మ్యాన్ నో వే హోమ్‌'కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్ల 'పుష్ప' హిందీ వెర్ష‌న్‌కు ఎక్కువ స్క్రీన్లు ల‌భించ‌ని స్థితి ఏర్ప‌డింది.